పవన్ సభకు అడుగడుగునా ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తుంది – నాదెండ్ల మనోహర్

పవన్ కళ్యాణ్ ఈరోజు పర్చూరులో చేపడుతున్న కౌలు రైతు భరోసా యాత్రకు ప్రభుత్వం అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తోందని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ ఆరోపించారు. పర్చూరు సభకు వెళితే అరెస్టులు చేస్తామంటూ కార్యకర్తలను, రైతులను పోలీసులు బెదిరిస్తున్నారనీ..కొన్ని చోట్ల నోటీసులు కూడా ఇస్తున్నారని మనోహర్ అన్నారు. కౌలు రైతులను అండగా నిలబడేందుకు పవన్‌ కల్యాణ్‌ వస్తుంటే ముఖ్యమంత్రి జగన్‌ గుండెల్లో రైళ్ళు పరుగెత్తుతున్నాయని నాదెండ్ల వ్యాఖ్యానించారు.

ప్రకాశం జిల్లా పర్చూరుకు పవన్‌ వస్తుంటే అక్కడికి వెళ్లొద్దంటూ కడప జిల్లాలో రైతులకు నోటీసులు ఇస్తున్నారంటే జగన్‌ ప్రభుత్వం ఏ స్థాయిలో భయపడుతుందో అర్ధం చేసుకోవాలన్నారు. కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గానికి చెందిన తమ పార్టీ వీర మహిళ పర్చూరు సభకు వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటుంటే పోలీసులు ఆమె ఇంటికి వెళ్లి నోటీ-సులు ఇచ్చారు. పర్చూరు సభకు వెళ్తే అరెస్టు చేస్తామని బెదిరించారు. ఇంత కంటే దౌర్భాగ్యమైన ప్రభుత్వం ఉంటు-ందా అని నాదెండ్ల మండిపడ్డారు. రాష్ట్ర స్థాయిలో వేల మంది రైతులను ఆడుకుంటున్న పవన్‌ కల్యాణ్‌ ను అభినందించాల్సింది పోయి అవమానపర్చేలా మాట్లాడుతున్నారని అన్నారు.

మరికాసేపట్లో పవన్ కళ్యాణ్ చిలకలూరిపేట, జాగర్లమూడి, యద్దనపూడి మీదుగా పవన్ పర్చూరుకు చేరుకుంటారు. మధ్యాహ్నం 3 గంటలకు ఎస్కేపీఆర్ డిగ్రీ కాలేజీ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడనున్నారు.