కోన‌సీమ జిల్లా పేరు మార్పు..

కోన‌సీమ జిల్లా పేరు మారింది. డా.బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు ఏపీ సర్కార్. ఏపీలో ఇటీవ‌లే 13 కొత్త జిల్లాల‌ను ఏర్పాటు చేస్తూ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసిన సంగ‌తి తెలిసిందే. కొత్త జిల్లాల‌కు సంబంధించి క‌స‌ర‌త్తు మొద‌లైన నాటి నుంచి కూడా కోనసీమ జిల్లాకు అంబేద్క‌ర్ పేరుపెట్టాల‌ని ద‌ళిత సంఘాలు, ప్ర‌జా సంఘాలు డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఈ డిమాండ్ కోసం ఆయా సంఘాలు పెద్ద ఎత్తున నిర‌స‌న‌ల‌కు కూడా దిగాయి. అయితే నాడు ఈ నిర‌స‌న‌ల‌ను అంత‌గా ప‌ట్టించుకోని ప్ర‌భుత్వం… తాజాగా జిల్లా పేరును మార్చేసింది. కోనసీమ జిల్లా పేరులో డా.బి.ఆర్‌.అంబేద్కర్‌ పేరును చేరుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఏపీలో గతంలో 13 జిల్లాలు ఉండగా.. వాటిని 26 జిల్లాలుగా విభజించింది జగన్ ప్రభుత్వం. పార్లమెంట్ పరిధిని ఒక జిల్లాగా ఏర్పాటు చేసింది. విస్తీర్ణం ఎక్కువగా ఉన్న అరకు లోక్ సభ పరిధిలో మాత్రం రెండు జిల్లాలను ఏర్పాటు చేసింది. ఏప్రిల్ 4 నుంచి కొత్త జిల్లాల పాలన అమలులోనికి వచ్చింది. జిల్లాలను విభజించిన జగన్ ప్రభుత్వం.. కొన్ని జిల్లాలకు ప్రముఖుల పేర్లు పెట్టింది. అల్లూరి, ఎన్టీఆర్ పేర్లు పెట్టారు. గతంలోనే కడప జిల్లాకు వైఎస్సార్ పేరు ఉంది. దేవుళ్ల పేర్లను కొన్ని జిల్లాలకు పెట్టింది. అయితే జిల్లాల పేర్లకు సంబంధించి కొన్ని వివాదాలు వచ్చాయి. అల్లూరి, ఎన్టీఆర్ లానే అమలాపురం కేంద్రం ఏర్పడిన కోనసీమ జిల్లాకు రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని డిమాండ్ వచ్చింది. ఈ డిమాండ్ కు సర్కార్ దిగొచ్చింది.