త‌డిసిన వ‌రి ధాన్యం కొంటాం – కేసీఆర్

త‌డిసిన వ‌రి ధాన్యం కొనుగోలు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. అకాల వర్షాలతో కల్లాల్లో ఆరబోసిన వడ్లన్నీ నీట తడిశాయి. మరికొన్ని చోట్ల కొట్టుకుపోయాయి. చేతికొచ్చిన వ‌రి ధాన్యం కోనుగోలు కేంద్రాల‌కు చేరింద‌ని ఆనంద ప‌డేలోపే ఆకాల వర్షం రైతులను నట్టేట ముంచింది. ఈపరిస్థితి నుంచి తమను ప్రభుత్వం గట్టెక్కించాలని రైతులు వేడుకుంటున్నారు. ఈ క్ర‌మంలో రైతుల‌కు సీఎం కేసీఆర్ ఊర‌ట‌నిచ్చే విష‌యాన్ని వెల్ల‌డించారు. రైతులు ఎవ‌రూ ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని, త‌డిసిన ధాన్యాన్ని కొంటామ‌ని సీఎం స్ప‌ష్టం చేశారు. ప‌ల్లె, ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తిపై స‌మీక్ష సంద‌ర్భంగా వరి ధాన్యం కొనుగోళ్ల‌పై కూడా కేసీఆర్ ఆరా తీశారు.

వర్షాకాలం సమీపిస్తుండడంతో ధాన్య సేకరణ వేగవంతం చేయాలని అధికారుల‌ను సీఎం ఆదేశించారు. ధాన్యం తూకం, గన్నీ బ్యాగులు, రవాణా, మిల్లుల్లో దిగుమతితో పాటు ప‌లు విష‌యాల‌ను అధికారులను అడిగి కేసీఆర్ తెలుసుకున్నారు. మొత్తం 56 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇప్పటి వరకు 20 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యాన్ని సేకరించిన‌ట్లు అధికారులు సీఎంకు తెలిపారు. అకాల వర్షాల కారణంగా అక్కడక్కడ వరిధాన్యం తడుస్తున్న నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఎంత ఖ‌ర్చ‌యినా వెనుకాడ‌కుండా.. తడిసిన ధాన్యంతో పాటు చివరి గింజ వరకు ప్ర‌భుత్వ‌మే కొనుగోలు చేస్తుంద‌ని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు.