జ‌గ‌న్‌, ష‌ర్మిల మ‌ధ్య ఎలాంటి విభేదాలు లేవు

విభేదాలు ఉన్నాయంటూ కొంద‌రు వ్యాఖ్య‌లు చేస్తున్నారు..ఏపీ డిప్యూటీ సీఎం నారాయ‌ణ స్వామి

తిరుమల : ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ఈ రోజు ఉద‌యం తిరుమ‌ల శ్రీ‌వారిని దర్శించుకున్నారు. ఆనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ, తెలంగాణ మధ్య నీటి వివాదం త‌లెత్తిన నేప‌థ్యంలో వైఎస్ జగన్, ఆయ‌న సోద‌రి వైఎస్‌ షర్మిలకు మ‌ధ్య విభేదాలు ఉన్నాయంటూ కొంద‌రు అంటున్నార‌ని, అందులో వాస్తవం లేదని ఆయ‌న చెప్పారు. జగన్, ఆయ‌న సోద‌రి వైఎస్‌ షర్మిలకు మ‌ధ్య ఎలాంటి విభేదాలు, మనస్పర్థలు లేవని చెప్పుకొచ్చారు. వారిద్ద‌రి మధ్య విభేదాలు ఉన్నాయంటూ కొంద‌రు వ్యాఖ్య‌లు చేస్తుండ‌డం స‌రికాద‌ని అన్నారు.

అస‌లు జ‌ల వివాదాల‌కు చంద్రబాబు నాయుడే కారణమని డిప్యూటీ సీఎం ఆరోపించారు. ఇరు రాష్ట్రాల మ‌ధ్య జ‌ల వివాదం కొన‌సాగుతున్న‌ప్ప‌టికీ చంద్రబాబు ఎందుకు స్పందించడం లేదని ఆయ‌న నిల‌దీశారు. ఈ విష‌యంపై చంద్ర‌బాబు నాయుడిని మీడియా అడ‌గాల‌ని ఆయ‌న సూచించారు. జ‌గ‌న్‌కు ఆంధ్ర‌, తెలంగాణ అంటూ తేడాలు ఏమీ లేవ‌ని చెప్పారు. అంద‌రం తెలుగువారమేన‌ని, అంద‌రం ఐక్యంగా ఉండాల‌ని ఆయ‌న అన్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో జ‌గ‌న్ ప్ర‌భుత్వం వ‌చ్చాక‌ 31.50 లక్షల మంది పేదల‌కు ఇంటి స్థలాలు ఇవ్వడమే కాకుండా, ఇళ్లు కూడా కట్టిస్తున్నార‌ని ఆయ‌న చెప్పారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/