దళితబంధు కార్యక్రమం కాదు.. ఉద్యమం : సీఎం కేసీఆర్‌

హుజూరాబాద్ దళిత ప్రతినిధులతో కేసీఆర్ సమావేశం

హైదరాబాద్ : సీఎం కెసిఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో సోమవారం ‘దళిత బంధు’ పథకంపై హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన దళిత ప్రతినిధులతో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ.. హుజూరాబాద్‌ ప్రతినిధులు సాధించే విజయం మీదే.. యావత్‌ తెలంగాణ దళితబంధు విజయం ఆధారపడి ఉందన్నారు. అందరూ ఆ దిశగా దృఢ నిర్ణయం తీసుకోవాలన్నారు. ఒక్కడితో ప్రారంభమైన తెలంగాణ ఉద్యమం.. భారత రాజకీయ వ్యవస్థపై ఒత్తిడి తెచ్చి విజయం సాధించినట్లు గుర్తు చేశారు.

‘దళితబంధు కేవలం కార్యక్రమం కాదు.. ఉద్యమం. మంచి కార్యక్రమానికి ప్రతికూల శక్తులు ఉంటాయి. మనలో పరస్పర సహకారం పెరగాలి.. ద్వేషాలు పోవాలి’ అని సూచించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కృషితో దళిత సమాజంలో వెలుతురు ప్రసరించిందని కేసీఆర్ చెప్పారు. దళితవాడల్లో ఇప్పటికే నమోదైన పరస్పర కేసులను పోలీస్ స్టేషన్లలో రద్దు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు హరీశ్ రావు, కొప్పుల ఈశ్వర్ తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు, 412 మంది దళిత ప్రతినిధులు హాజరయ్యారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/international-news/