ఆరోగ్యశ్రీ లోకి మరికొన్ని చికిత్సలు అందించబోతున్న ఏపీ జగన్..

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆరోగ్యశ్రీ లోకి మరికొన్ని చికిత్సలు చేర్చబోతున్నట్లు తెలిపారు. బుధవారం వైద్య ఆరోగ్యశాఖపై తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ ఆఫీస్ లో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా.. ఆగస్టు 1వ తేదీ నుంచి పెంచిన చికిత్సలను ఆరోగ్యశ్రీలో చేర్చేలా చర్యలు తీసుకోవాలని, ఆగస్టు 15 నుంచి ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ను అందుబాటులోకి తీసుకురావాలని జగన్‌ ఆదేశించారు. ప్రస్తుతం ఆరోగ్య శ్రీ ద్వారా 2,446 చికిత్సలకు ఉచితంగా వైద్యం అందిస్తుండగా.. పెంచనున్న చికిత్సల జాబితాను త్వరలోనే ఖరారు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

విలేజ్‌ క్లినిక్స్‌కు, పీహెచ్‌సీలకు డిజిటల్‌ వీడియో అనుసంధానత ఉండాలన్న జగన్‌.. కరోనా పైనా సమీక్ష నిర్వహించారు. అలాగే ప్రికాషన్‌ డోసు వ్యవధిని తగ్గించినందున వ్యాక్సినేషన్‌ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. నూతన వైద్య కళాశాలల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని, మెడికల్‌ కాలేజీల్లో వీలైనంత త్వరగా తరగతులు నిర్వహించేలా తగిన ప్రణాళికతో ముందుకెళ్లాలని అధికారులకు సూచించారు.

ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు వర్చువల్‌ బ్యాంకు ఖాతాలు తెరవాలని, ఆరోగ్యశ్రీ కింద డబ్బు నేరుగా రోగి వర్చువల్‌ బ్యాంకు ఖాతాలోకి చేర్చి అక్కడనుంచి ఆస్పత్రికి చెల్లింపులు చేయాలన్నారు. ఆస్పత్రిలో చేరిన రోగి నుంచి ముందుగా కన్సెంట్‌ ఫాం, చికిత్స పూర్తైన తర్వాత ధృవీకరణ పత్రం తీసుకోవాలన్నారు. ధృవీకరణ పత్రంలో వైద్యం కోసం ఆరోగ్యశ్రీ ద్వారా ప్రభుత్వం నుంచి అందిన సహాయం వివరాలు… అలాగే రోగి కోలుకునేంతవరకూ ఆరోగ్య ఆసరా ద్వారా అందుతున్న సహాయం వివరాలు తెలియజేయాలని జగన్ నిర్దేశించారు. రోగి నుంచి అదనంగా డబ్బులు వసూలు చేశారా, లేక పూర్తిగా ఉచితంగా వైద్యం అందిందా అన్న విషయాలనూ ధృవీకరించేలా పత్రం ఉండాలన్నారు. ఎవరైనా లంచం లేదా అదనపు రుసుము వసూలు చేస్తే ధృవీకరణ పత్రంలో ఫిర్యాదుల కోసం ఏసీబీకి కేటాయించిన టోల్‌ఫ్రీ నంబర్‌ 14400 లేదా 104 ఉంచాలని జగన్ ఆదేశాలు జారీ చేశారు.