రైతులకు ఏపీ సీఎం గుడ్ న్యూస్

రైతులకు ఏపీ సీఎం జగన్ గుడ్ న్యూస్ తెలిపారు. ఈ నెల 29న రైతుల బ్యాంకు ఖాతా లోకి వైఎస్సార్ సున్నా వడ్డీ రాయితీ డబ్బులు జమ చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. రబీ 2020-21, ఖరీఫ్ 2021 సీజన్లకు సంబంధించి రూ.లక్షలోపు బ్యాంకుల నుంచి పంట రుణం తీసుకుని గడువులోగా తిరిగి చెల్లించిన వారికి వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం కింద వడ్డీ రాయితీ డబ్బులను ప్రభుత్వం జమ చేయనుంది.

రబీ 2020-21 సీజన్‌కు 2,54,568 మందిని లబ్ధిదారులుగా ప్రభుత్వం గుర్తించింది. వీరి బ్యాంకు అకౌంట్లలో ఈ నెల 29న రూ.45.22 కోట్లు జమ చేయనుంది. నేటి నుంచి లబ్ధిదారుల జాబితాను రైతు భరోసా కేంద్రాల్లో అధికారులు అందుబాటులో ఉంచనున్నారు. రైతులు వీటిని పరిశీలించి ఏమైనా తప్పులు ఉంటే సరిచేసుకోవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నెల 22 వరకు తప్పులను చూసుకుని మార్చుకునే అవకాశం ని అధికారులు కల్పించారు. ఆ తరవాత ఈ నెల 29నే ఆయా రైతులకి డబ్బులు జమ చేయనున్నారు.