నేడే ఏపీ బ‌డ్జెట్ ..మంత్రి బుగ్గ‌న బడ్జెట్ పై సర్వత్ర ఆసక్తి

minister buggana

అమరావతి : ఈరోజు అసెంబ్లీలో ఏపీ బడ్జెట్ ను ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్ట‌నుంది. ఆర్థిక మంత్రి బుగ్గ‌న రాజేంద్రనాథ్ రెడ్డి అసెంబ్లీలో 2022-23 ఆర్థిక సంవ‌త్స‌రానికి గాను బ‌డ్జెట్ ను ప్ర‌వేశపెట్ట‌నున్నారు. ఈ ఆర్థిక సంవ‌త్స‌రానికి రూ. 2.50 ల‌క్షల కోట్ల‌తో బ‌డ్జెట్ ను ప్ర‌వేశ పెట్టే అవ‌కాశం ఉంది. రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి దృష్ట్యా ఈ ఏడాది బ‌డ్జెట్ ఏ విధంగా రూపొందించార‌నే ఆస‌క్తి నెలకొంది. ఈ రోజు ఉద‌యం 9 గంట‌ల‌కు రాష్ట్ర కేబినెట్ స‌మావేశం అవుతుంది. రాష్ట్ర బ‌డ్జెట్ కు కేబినెట్ ఆమోదం తెలుపుతుంది. అనంత‌రం ఈ రోజు ఉద‌యం 10:30 గంట‌ల‌కు అసెంబ్లీ ఆర్ధిక మంత్రి బుగ్గ‌న రాజేంద్ర నాథ్ రెడ్డి ప్ర‌వేశ పెడుతారు. అనంతరం వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు 2022-2023 వ్యవసాయ, అనుబంధ రంగాల ప్రకటన (బడ్జెట్)ను ఉదయం 11 గంటలకు సమర్పిస్తారు. అలాగే మండ‌లిలో మంత్రి అప్ప‌లరాజు బ‌డ్జెట్ ప్ర‌వేశ పెట్టే అవ‌కాశం ఉంది.

కాగా, సంక్షేమ పథకాలు, వ్యవసాయం, మౌలిక సౌకర్యాలకు, సాగునీటి ప్రాజెక్టులు సహా అనేక కీలక ప్రాజెక్టులకు బడ్జెట్‌లో కేటాయింపులు ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా న‌వ‌ర‌త్నాల‌కు కూడా ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌భుత్వం బ‌డ్జెట్ లో అధిక నిధులు కేటాయించినట్లు తెలుస్తోంది. గతేడాది (2021-22) బడ్జెట్‌ అంచనా వ్యయం రూ.2.29 లక్షల కోట్లు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/national/