బహుళజాతి సంస్థలతో మేలు చేకూరేదెవరికి?

స్వదేశీ సంస్థలకు ముప్పుతప్పదా..?

multinational corporations

సమాజాభివృద్ధికై పాలకులు చేపట్టే ఏ కార్యక్రమమైనా పేదల పక్షాన నిలిచి వారి పురోగతిని కాంక్షించి, పేదరిక నిర్మూలనకై చేపట్టేదిగా కొనసాగాలి. ఆర్థిక సమతుల్యాన్ని పాటించి, అట్టడుగు ప్రజల అభ్యున్నతికి పాటుపడాలి. ఆకలిచావులు అనే మాట ఎక్కడా వినిపించకూడదు.

అనుకోని పరిస్థితులలో పర్యావరణ కాలుష్యానికి దోహదపడిన, ఎలాంటి సమస్యలకు దారి తీసినా వెంటనే ప్రత్యామ్నాయ మార్గాలను చేపట్టి పరిష్కార మార్గాలను సూచించి ముందుకెళ్లే ధోరణిని కలిగవుండాలి. అలా చేసినప్పుడే కొంతమేర అభివృద్ధిని నోచుకునే వీలు కలుగుతుంది.

రెం డవ ప్రపంచ యుద్ధం అనంతరం ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. కొన్ని దేశాలకే పరిమితమైన పారిశ్రామికాభివృద్ధి ప్రపంచీకరణ నేపథ్యంలో పలు దేశాలకు వ్యాప్తి చెందింది.

వలస పాలనల నుండి పురుడు పోసు కున్న ఎన్నో దేశాలు అభివృద్ధి అనే పేరుతో బహుళజాతి సంస్థలకు స్వాగతం పలికి ప్రపంచీకరణలో భాగమైనాయని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

అభివృద్ధి అంటే దేశంలో ఒక వర్గం ఆకర్షణీయమైన బహుళ అంతస్తుల అద్దాల భవనాలు నిర్మించి, ఆర్థికపరమైన వ్యత్యాసాలతో శ్రమదోపిడీకి పాల్పడటం సరైనది కాదు.

పేదవర్గానికి చెందిన అత్యధిక శాతం ప్రజలకు కనీసా వసరాలను తీరుస్తూ,వారిని అభివృద్ధి పథం వైపు పయనించేలా చేయడమే నిజమైన అభివృద్ధి.

కానీ ఈ బహుళజాతి సంస్థలు పేదలపట్ల ఎలాంటి మేలు చేకూర్చిందంటే జవాబులేని ప్రశ్నగానే మిగిలిపోతుందనడంలో అబద్ధం లేదు. ఏదైనా ఒక దేశం ఒక మల్టీనేషనల్‌ కంపెనీకి సాదరంగా ఆహ్వానం పలుకుతుందంటే ఒకే ఒక కారణం అభివృద్ధి.

మల్టీ నేషనల్‌ కంపెనీ అంటే ప్రపం చంలోని పలు దేశాలను అనుసంధానంగా చేసుకొని, తక్కువ ధరలకు లభించే వనరులననుసారంగా తమ కార్యకలాపాలను కొనసాగించి, తక్కువ వ్యయంతో ఎక్కువ లాభార్జనకై పాటు పడతారు.

ముఖ్యంగా ఇలాంటి పెట్టుబడిదారులు తమ పెట్టుబడిని ఖనిజాలను వెలికితీయడం, పెట్రోలియం, ఎలక్ట్ట్రానిక్‌, ఆటోమొబైల్‌, ఇంజినీరింగ్‌, రసాయనాల తయారీ, గనుల తవ్వకం, నూనెతోటల పెంపకం లాంటి రంగాలలో పెట్టడం జరుగుతుంది. ఇలాంటి కంపెనీల వల్ల ద్వంద్వ ఆర్థిక నిర్మితాలు తీవ్రతరమవుతాయి.

అంతేగాకుండా ముఖ్యమైన వనరులను ఆయా దేశాలకవసరమైన ఉత్పత్తుల కోసం గాకుండా విదేశీయుల అవసరాల కొరకు స్వదేశీ ధనికుల వినియోగ నిమిత్తం తరలించడం జరుగుతుంది.

దీనివల్ల గ్రామీ ణ పట్టణ ప్రాంతాల మధ్య అసంతులనం ఏర్పడి, గ్రామీణ ప్రజలు పట్టణాలకు వలసలు పోవడానికి దారి తీస్తుంది.

మరి కొన్ని కంపెనీలు ప్రపంచ దేశాలకు అవసరంలేని వస్తువుల ఉత్పత్తి గావించి, వాటిని విక్రయించడానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞ్ఞానం ఉపయోగించుకొని రకరకాల ప్రకటనల ద్వారా ధనిక వర్గాన్ని ఆకర్షించి అనవసర వినియోగానికి బీజం పోసి ప్రోత్స హిస్తాయి.

అదేవిధంగా స్థానికులకు ఎలాంటి లాభం లేకుండా అక్కడి వనరులను మరొక చోటికి తరలించి వారిరువురి మధ్య చిచ్చు బెడుతుంది.

అలాగే కొన్ని సందర్భాలలో రాజకీయ నిర్ణ యాలలో ప్రముఖ పాత్ర వహించి ఆయా దేశాల ఆస్తులపై గుత్తాధిపత్యాన్ని చేజిక్కించుకుంటాయి. బహుళజాతి కంపెనీల వ్యవస్థాపకుల వద్ద అపారమైన ఆర్థిక వనరులుంటాయి.

ఇవి అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులు పొంది, పలు దేశాల్లోని మార్కెట్లు సైతం అందుబాటులో ఉండి, తమ సరుకులను చక్కగా అమ్ముకునే వెసులుబాటు ఉంటుంది.

ప్రస్తుత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని ప్రపంచ వ్యాప్తంగా ఏ మూల ఏ సరుకు ఎంతకు అమ్ముడవుతుందో, ఏ సరుకు కొరత ఎంత ఉందో క్షణాల్లో తెలుసుకుంటూ, దానికనుగుణంగా తమ కార్యకలాపాలను కొనసాగిస్తాయి.

టీవీలలో వ్యాపార ప్రకటనల కోసం అధిక వ్యయాన్ని హెచ్చించి, మానసికంగా కొనుగోలుదారు ని అభిరుచిని ప్రభావితం చేసి కొనేలా చేస్తుందనడంలో ఎలాంటి సందేహం అక్కరలేదు.

అదేవిధంగా వీటికి పరిశోధన అభివృద్ధి సౌకర్యాలుండి, ఎప్పటికప్పుడు వినియోగదారులలో వచ్చే మార్పులను గమనించి, వారిని సంతృప్తిపరచటానికి కొత్త ఉత్పత్తులను సృష్టిస్తూ వ్యాపారం చేస్తుంటాయి.

బహుళజాతి కంపెనీల స్థాపన అనంతరం స్వదేశీ కంపెనీల మనుగడకే ముప్పు వాటిల్లి మూసేసే పరిస్థితి నెలకొన్నా ఆశ్చర్యపడనక్క ర్లేదు.

ఏ కోణంలో పోటీ పడలేక, చివరికి తమ కార్యకలాపాలను కొనసాగించాలంటే ఆయా కంపెనీలతో అనుసంధానమై పని చేయడం, లేదంటే నష్టాల ఊబిలోకి పోవడం తప్పా మరోదారి కనిపించని పరిస్థితి నెలకొంటుంది.

ఈ విషయంలో మల్టీ నేషనల్‌ కంపెనీలు తయారైన సరుకులను ధరలు తగ్గించి, స్వదేశీ కంపెనీలు మూతబడటానికి దోహదపడి, ఆ తర్వాత క్రమేణ ధరలను పెంచుతూ, తమకెవ్వరూ సాటిలేరని, తమ ఇష్టారాజ్యాంగా ప్రవర్తిస్తున్నాయనడంలో అవాస్తవం లేదు.

అలాగాకుండా మల్టీనేషనల్‌ కంపెనీలతో పోటీని ఎదుర్కోలేక స్వదేశీ కంపెనీలు ఆయా కంపెనీలు ఒప్పందం కుదుర్చుకుంటే, అది అమలులో ఉన్నప్పుడేగాక, ఒప్పందం గడువు ముగిశాక కూడా తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇతరులకు అమ్ముకోకూడదని శాసిస్తాయి.

అలాగే అవి నిర్దేశించిన గరిష్ట ధరలకే సరుకులను తయారుచేయాలని ఆదేశాలు జారీచేస్తాయి. ఒకవేళ విదేశాలకు సరుకులను అమ్మాలనుకుంటే తమ ద్వారా మాత్రమే జరగాలని పట్టుబడతాయి.

తమ అనుమతి లేకుండా ఎలాంటి ఎగుమతులు చేయరాదని ఆదేశిస్తూ, తమ తరఫున విదేశీ సాంకేతిక నిపుణు లను, టెక్నోక్రాట్లను నియమించడం ద్వారా ఉత్పత్తిపై అదుపు సాధిస్తూ, తమకి నచ్చని దేశాలకు సరుకుల్ని సరఫరా చేయరా దని ఇలాంటి షరతులన్నింటిని ఏదోవిధంగా అమలు చేస్తాయన డంలో ఎలాంటి అబద్ధం లేదు.

ఏ మల్టీ నేషనల్‌ కంపెనీ తీసుకునా ముడిపదార్థాలు తప్పనిసరి. వాటికొరకు ఎక్కువగా సహజ వనరుల వాడకమే జరుగుతుంది.

మరీ ముఖ్యంగా అడవులు, నదులున్న చోటుని ఎంచుకొని అడవుల వినాశనానికి పాటుపడు తూ వాటిపై ఆధారపడి జీవించేవారిని నిర్వాసితులను చేసి, పొట్ట కొట్టిన సందర్భాలలో వెలుగెత్తిన సామాజిక ఉద్యమాలను చరిత్ర పుటలలో నిగూఢమైన విషయం అందరికీ తెలిసిందే.

అభివృద్ధి నెపంతో ఏ కార్యక్రమాన్నైనా కంపెనీలతో చేపట్టిన సందర్భాలలో పేదల పాలిట మరిన్ని కష్టాలకు దారితీసిందే తప్పా అభివృద్ధి ఎక్కడ జరిగిందో అర్థంగాని పరిస్థితి. అభివృద్ధి అనేది పేదల సమాధులపై నిర్మితం గాకూడదు.

కానీ పురోగతికి పూనుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఒకవేళ అభివృద్ధిని కాంక్షించి బహుళజాతి సంస్థలకు స్వాగతం పలికితే స్వాతంత్య్రం సిద్ధించి ఏడు దశాబ్దాలు గడిచినా పెదల ఆకలి చావులు ఆగటం లేదు.

సమాజాభివృద్ధికై పాలకులు చేపట్టే ఏ కార్యక్రమమైనా పేదల పక్షాన నిలిచి వారి పురోగతిని కాంక్షించి, పేదరిక నిర్మూలనకై చేపట్టేదిగా కొనసాగాలి. ఆర్థిక సమతుల్యా న్ని పాటించి, అట్టడుగు ప్రజల అభ్యున్నతికి పాటుపడాలి.

ఆకలిచావులు అనే మాట ఎక్కడా వినిపించ కూడదు. అనుకోని పరిస్థితులలో పర్యావరణ కాలుష్యానికి దోహదపడిన, ఎలాంటి సమస్యలకు దారి తీసినా వెంటనే ప్రత్యామ్నాయ మార్గాలను చేపట్టి పరిష్కార మార్గాలను సూచించి ముందుకెళ్లే ధోరణిని కలిగవుండాలి.

  • పోలం సైదులు

తాజా ‘మొగ్గ’ (చిన్నారుల ప్రత్యేకం) కోసం : https://www.vaartha.com/specials/kids/