ఆ బ్యూటీ మర్యాద మరిచింది.. క్షమాపణలు చెప్పింది!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ వకీల్ సాబ్ బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు వేణు శ్రీరామ్ తెరకెక్కించిన తీరు ప్రేక్షకులతో పాటు సినీ విశ్లేషకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇక మూడేళ్ల తరువాత పవన్ బొమ్మ పడటంతో ఈ సినిమాను చూసేందుకు జనం థియేటర్లకు క్యూ కట్టారు. ఈ సినిమా అందుకున్న విజయాన్ని పవన్‌తో సహా ఆయన అభిమానులు కూడా ఎంజాయ్ చేశారు.

ఇక ఈ సినిమాను ఇటీవల అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌కు పెట్టారు. కాగా ఈ సినిమాను థియేటర్లలో చూడని వారు అమెజాన్ ప్రైమ్ వీడియోలో చూసి ఎంజాయ్ చేస్తున్నారు. కాగా పవన్ వకీల్ సాబ్ చిత్రాన్ని చూసిన ఓ హీరోయిన్, ఈ సినిమాను ఓ రేంజ్‌లో పొగిడేద్దామని చేసిన ట్వీట్ పవన్ అభిమానులను ఆగ్రహానికి గురి చేసింది. అసలు విషయం తెలుసుకున్న ఆ హీరోయిన్, వెంటనే పవన్ అభిమానులకు సారీ చెప్పేసింది. మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ వకీల్ సాబ్ చిత్రాన్ని చూసి ఈ సినిమా చాలా అద్భుతంగా ఉందని, ముఖ్యంగా ఈ సినిమాలో నివేదా థామస్, అంజలి, అనన్యాలు అదరగొట్టారని.. పవన్ సత్తా అంటే ఇదే అంటూ ట్వీట్ చేసింది.

అయితే తమ హీరోను మర్యాద లేకుండా కేవలం పవన్ అని సంబోధించడంతో పవన్ అభిమానులు మండిపడ్డారు. వెంటనే తేరుకున్న అనుపమ, అభిమానులకు క్షమాపణలు చెబుతూ పవన్ కళ్యాణ్ గారు అంటూ మరో ట్వీట్ చేసింది. దీంతో పవన్ అభిమానులు శాంతించారు. మొత్తానికి తమ అభిమాన హీరోను ఏకవచనంతో ఈ బ్యూటీ చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.