మరో ఉగ్రకుట్ర భగ్నం ..అసోంలో ఇద్దరు అల్‌ఖైదా ఉగ్రవాదులు అరెస్టు

two-al-qaeda-linked-terror-suspects-arrested-in-assam

దిస్పూర్‌: అసోం పోలీసులు అల్‌ఖైదాతో సంబంధాలున్న ఇద్దరిని అరెస్టు చేశారు. వారిని అన్సరుల్లా బంగ్లా టీమ్‌ (ABT) సభ్యులుగా గుర్తించారు. అల్‌ఖైదాతో సంబంధమున్న ఏబీటీ అసోంలో చాపకింద నీరులా విస్తరిస్తున్న విషయం తెలిసిందే. కాగా, రెండు రోజుల క్రితం మదర్సా బోధకుడు సహా నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వారిచ్చిన సమాచారంతో పోలీసులు బార్పేటా, తమూల్పూర్‌, నల్బరీ ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో మరో ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.

కాగా, ఉగ్రవాదులతో సంబంధాలన్నాయనే ఆరోపణలతో ఆగస్టు తర్వాత రాష్ట్రంలో నాలుగు మదర్సాలను కూల్చివేసిన విషయం విధితమే. జిహాదీ కార్యకలాపాలకు అసోం అడ్డాగా మారిందని సీఎం హిమంత బిశ్వ ఇప్పటికే ప్రకటించారు. టెర్రరిస్టు కార్యకలాపాలను అడ్డుకోవడంలో భాగంగా ఇతర రాష్ట్రాల నుంచి మదర్సాల్లో బోధించడానికి వచ్చేవారు తప్పనిసరిగా తమ పేర్లను రిజిస్ట్రర్‌ చేయించుకోవాలని సూచించారు. కాగా, గత ఏప్రిల్‌ తర్వాత ఉగ్రవాదులతో సంబంధాలున్న 45 మందిని అసోం పోలీసులు అరెస్టు చేశారు.