మేడిగడ్డ బ్యారేజ్‌.. రాష్ట్ర ప్రభుత్వానికి జాతీయ డ్యామ్‌ భద్రత అథారిటీ మరో లేఖ

another-letter-from-center-to-state-govt-regarding-medigadda-barrage

హైదరాబాద్‌ః కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజ్‌లో 20వ పియర్‌ కుంగుబాటు అంశం ఇప్పుడు రాష్ట్రంలో పెను దుమారం రేపుతోంది. సరిగ్గా ఎన్నికల సమయంలో ఈ ఘటన జరగడం ఇప్పుడు అధికార పార్టీ మెడకు ఉచ్చు బిగిస్తోంది. ఇటీవల రాష్ట్రంలో పర్యటించిన కేంద్రం బృందం పలు వివరాలను సేకరించింది. పగుళ్లు వల్ల వంతెన పటిష్ఠత తదితర అంశాలపై వివరాలు సేకరించి కేంద్రానికి నివేదిక అందజేసింది.

అయితే తాజాగా మేడిగడ్డ ఘటనపై కేంద్రం తెలంగాణ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసింది. ఘటనపై తాము కోరిన సమాచారం వెంటనే ఇవ్వాలని జాతీయ డ్యామ్‌ భద్రత అథారిటీ మరోసారి లేఖ రాసింది. ఆదివారంలోగా వివరాలు ఇవ్వాలని లేఖలో ఆదేశించింది. ఈనెల 23వ తేదీ నుంచి 26వ తేదీ వరకు ప్రాజెక్టును సందర్శించిన కేంద్ర కమిటీకి ఆ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం కొంత సమాచారం ఇచ్చింది. కమిటీ తిరుగుపయనానికి ముందే.. వారు అడిగిన మరికొన్ని వివరాలు ఇవ్వకపోవడంతో ఇప్పుడు జాతీయ డ్యామ్‌ భద్రత అథారిటీ మరోసారి లేఖ రాసింది. మొత్తం 20 అంశాల సమాచారాన్ని కోరగా.. ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం 3 అంశాల వివరాలు మాత్రమే ఇచ్చిందని.. ఆదివారం వరకు అన్ని అంశాలపై సమగ్ర సమాచారం అందించాలని లేఖలో పేర్కొంది.