అమిత్‌ షా ముంబై పర్యటనలో భద్రత లోపం..

కేంద్రమంత్రి పర్యటన అంటే భద్రత ఎంత పటిష్టంగా ఉండాలో చెప్పాల్సిన పనిలేదు. అలాంటిది అమిత్ షా ముంబై పర్యటన లో ఓ అనుమానాస్పదంగా ఓ వ్యక్తి గంట పాటు హల్చల్ చేయడం హాట్ టాపిక్ అవుతుంది. ఏపీకి చెందిన ఓ ఎంపీకి వ్యక్తిగత కార్యదర్శినంటూ కేంద్ర హోంమంత్రి అమిత్​ షా పక్కనే అనుమానాస్పదంగా తిరిగిన వ్యక్తిని ముంబయి పోలీసులు అరెస్టు చేశారు. అతడ్ని గిర్గావ్​ కోర్టులో హాజరుపరచగా.. న్యాయస్థానం ఐదు రోజుల కస్టడీకి పంపింది. సెప్టంబర్​ 5న జరిగిన ఈ ఘటన గురించి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

అమిత్ షా పర్యటనలో ఉండే వారి జాబితాలోనూ, భద్రతా సిబ్బంది బృందంలోనూ ఆ పేరు లేదని పోలీసుల విచారణలో వెల్లడైంది.ఆంధ్రప్రదేశ్‌ లోని కోనసీమ జిల్లా అమలాపురం ఎంపీ వ్యక్తిగత కార్యదర్శి పేరుతో ఓ నకిలీ ఐడీ కార్డు కూడా నిందితుడి వద్ద లభించినట్లు తెలుస్తోంది. హేమంత్ పవార్ మహారాష్ట్రలోని ధులేకు చెందిన వాడిగా పోలీసులు గుర్తించి సోమవారం అరెస్టు చేశారు. ఈవిషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. నిందితుడు చాలా సేపు అమిత్ షా వెంట వెళ్లడం స్పష్టంగా సీసీటీవీ ఫుటేజీల్లో కన్పించింది.