స్మోక్ అటాక్ అంశంపై విప‌క్షాలు ఆందోళ‌న.. ఉభ‌య‌స‌భ‌లు వాయిదా

Amid ruckus, Lok Sabha, Rajya Sabha adjourned till 2pm

న్యూఢిల్లీ: ఈరోజు పార్ల‌మెంట్‌ లో లోక్‌స‌భ‌లో జ‌రిగిన స్మోక్ అటాక్ అంశంపై విప‌క్షాలు ఆందోళ‌న చేప‌ట్టాయి. భ‌ద్ర‌తా వైఫ‌ల్యాల‌పై చ‌ర్చ చేప‌ట్టాల‌ని విప‌క్షాలు డిమాండ్ చేశాయి. ఇవాళ ఉద‌యం రాజ్య‌స‌భ రెండు సార్లు వాయిదా ప‌డింది. తొలుత 11.30 వ‌ర‌కు చైర్మెన్ జ‌గ‌దీప్ వాయిదా వేశారు. ఆ త‌ర్వాత మ‌ళ్లీ విప‌క్ష స‌భ్యులు ఆందోళ‌న చేప‌ట్ట‌డంతో స‌భ‌ను రెండు గంట‌ల వ‌ర‌కు వాయిదా వేశారు. ఇక లోక్‌స‌భ‌ను మ‌ధ్యాహ్నం వ‌ర‌కు వాయిదా వేశారు. ఇవాళ విప‌క్ష నేత‌లు రూల్ 267 కింద 22 నోటీసులు ఇచ్చారు. నోటీసుల‌ను తిర‌స్క‌రిస్తున్న‌ట్లు రాజ్య‌స‌భ చైర్మెన్ జ‌గ‌దీప్ ధంక‌ర్ తెలిపారు.

సెక్యూర్టీ వైఫ‌ల్యం అంశంపై లోక్‌స‌భ‌లో విప‌క్ష స‌భ్యులు ఆందోళ‌న చేప‌ట్టారు. ఈ అంశంపై రాజ‌కీయం చేయ‌డం శోచ‌నీయ‌మ‌ని స్పీక‌ర్ ఓం బిర్లా అన్నారు. వెల్‌లోకి దూసుకువ‌చ్చి.. నినాదాలు చేయ‌డం స‌భా మ‌ర్యాద‌ల‌కు విరుద్ధ‌మ‌ని తెలిపారు. కీల‌క‌మైన అంశాల‌పై చ‌ర్చ చేప‌ట్టేందుకు ప్ర‌తిప‌క్షాల స‌హ‌కారం అవ‌స‌రమ‌ని ఓం బిర్లా అన్నారు. స్మోక్ అటాక్ ఘ‌ట‌న‌పై విచార‌ణ జ‌రుగుతోంద‌ని, ద‌ర్యాప్తు ఏజెన్సీలు ఆ వ్య‌వ‌హారాన్ని తేలుస్తాయ‌న్నారు. భ‌ద్ర‌తా వైఫ‌ల్యం ఘ‌ట‌న‌పై కేంద్ర మంత్రి అమిత్ షా ప్ర‌క‌ట‌న చేయాల‌ని లోక్‌స‌భ‌లో విప‌క్షాలు డిమాండ్ చేశాయి.

ఉభ‌య‌స‌భ‌ల నుంచి స‌స్పెండ్ అయిన 13 మంది ఎంపీలు ఇవాళ పార్ల‌మెంట్ మ‌క‌ర ద్వారం వ‌ద్ద ధ‌ర్నా నిర్వ‌హించారు. ప్ల‌కార్డులు ప్ర‌ద‌ర్శిస్తూ నినాదాలు చేశారు. హౌజ్‌లోకి ఎంట‌ర్ అవుతున్న స‌మ‌యంలో ద్వారం వ‌ద్ద ఉన్న ఆ ఎంపీల‌తో సోనియా గాంధీ మాట్లాడారు.