భారత్, అమెరికా విదేశాంగ శాఖ మంత్రుల భేటి..కెనడాతో వివాదంపై ఇరు వర్గాలు మౌనం

వివిధ రంగాల్లో ఇరు దేశాలు పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయం

Amid India-Canada diplomatic rift, S Jaishankar, Antony Blinken hold talks

న్యూయార్క్‌ః ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్ శుక్రవారం అమెరికా విదేశీ వ్యవహారాల మంత్రి ఆంథొనీ బ్లింకెన్‌తో సమావేశమయ్యారు. ఈ సమావేశం సందర్భంగా రక్షణ రంగం, అంతరిక్షం, పర్యావరణహిత ఇంధన రంగాల్లో ఇరు దేశాలు పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించారు. మంత్రి జైశంకర్ అమెరికా పర్యటన ఐదు రోజుల పాటు జరుగుతుంది. జీ20 సమావేశాల తరువాత ఇరు దేశాల మధ్య జరుగుతున్న ఉన్నత స్థాయి సమావేశం ఇదే. కెనడాతో వివాదం నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది.

కాగా, ఆంథొనీ బ్లింకెన్‌తో సమావేశంపై మంత్రి జైశంకర్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఆయనతో సమావేశంపై హర్షం వ్యక్తం చేశారు. అనేక అంశాలపై విస్తృతంగా చర్చించామని, ప్రపంచపరిణామాలపై కూడా మాట్లాడుకున్నామని జైశంకర్ తన పోస్టులో పేర్కొన్నారు. త్వరలో ఇరు దేశాల మధ్య జరగనున్న 2 ప్లస్ 2 (రక్షణ, విదేశాంగ శాఖ మంత్రుల సమావేశం) సమావేశాలపై కూడా చర్చించామని తెలిపారు. ఈ ఉన్నతస్థాయి సమావేశం నవంబర్‌లో జరగనుందని సమాచారం. అయితే, కెనడాలో నిజ్జర్ హత్యపై ఇరు దేశాలు ప్రస్తుతానికి మౌనాన్నే ఆశ్రయించాయి. ఈ విషయమై ఇప్పటివరకూ ఎటువంటి ప్రకటనా విడుదల చేయలేదు. ఈ అంశంపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు స్పందించేందుకు అమెరికా విదేశాంగ శాఖ మంత్రి నిరాకరించారు.