మంత్రి జైశంకర్‌పై అమెరికా ఎన్నారై నేతల ప్రశంసల వర్షం!

ఇరు దేశాల మధ్య ఆధునిక బంధానికి జైశంకర్ రూపశిల్పి అంటూ ఎన్నారైల ప్రశంసలు

biden-administration-officials-praise-minister-jaishankar

న్యూయార్క్ : భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌ను అమెరికా ఎన్నారై నేతలు పొగడ్తల్లో ముంచెత్తారు. ఆధునిక భారత-అమెరికా దౌత్య బంధానికి జైశంకర్ రూపశిల్పి అని కొనియాడారు. మంత్రి జైశంకర్ అమెరికా పర్యటన ముగింపు సందర్భంగా ఆయన గౌరవార్థం అమెరికాలో భారత రాయబారి తరణ్‌జిత్ సింగ్ సంధూ ఆధ్వర్యంలో ఓ విందు కార్యక్రమం జరిగింది. బైడెన్ ప్రభుత్వంలోని పలువురు కీలక భారత సంతతి సభ్యులు ఈ విందుకు హాజరయ్యారు. అమెరికా సర్జన్ జనలర్ వివేక్ మూర్తి, డిప్యూటీ సెక్రెటరీ ఆఫ్ స్టే్ట్ రిచర్డ్ వర్మ, బైడెన్ సలహాదారు నీరా టాండన్, వైట్‌హౌస్‌లోని నేషనల్ డ్రగ్ కంట్రోల్ పాలసీ డైరెక్టర్ డా, రాహుల్ గుప్తా తదితరులు ఈ విందులో పాల్గొన్నారు.

అమెరికా-భారత్ బంధం బలోపేతానికి ఎన్నారైలు ఎంతో కృషి చేశారని సీనియర్ దౌత్యవేత్త రిచర్డ్ వర్మ పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య బంధం ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపిస్తోందని వ్యాఖ్యానించారు. ఇరు దేశాల మధ్య ఆధునిక దౌత్య బంధానికి మంత్రి జైశంకర్ రూపశిల్పి అని కొనియాడారు. జైశంకర్ హయాంలో ఈ దౌత్య సంబంధాలు ఇనుమడించాయని పేర్కొన్నారు. ‘‘జైశంకర్ కృషి, నాయకత్వం వల్లే ఇప్పుడు మనం (అమెరికా, భారత్) ఈ స్థితిలో ఉన్నాం’’ అని ఆయన పేర్కొన్నారు.

కాగా, ఈ కార్యక్రమంలో అమెరికాలోని ఎన్నారైలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్నారైలపై జైశంకర్ ప్రశంసల వర్షం కురిపించారు. ద్వైపాక్షిక బంధం బలోపేతాకి ఇరు దేశాల ప్రజల మధ్య సంబంధాలు వారధిగా నిలుస్తాయని చెప్పారు.