ఇదే అదునుగా చూసుకుని చైనా దుశ్చర్యలు

మూడేళ్ల క్రితం డోక్లాంలోనూ చైనా‌ ఇలాంటి కుట్రలే..అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి డేవిడ్‌ స్టిల్‌వెల్‌

america-china
america-china

వాషింగ్టన్‌: భారత్-‌చైనా మధ్య చోటు చేసుకుంటున్న ఘర్షణపై అమెరికా చైనాపై మండిపడింది. ప్రపంచమంతా కరోనాపై పోరాడుతుంటే ఇదే సమయాన్ని అదునుగా చూసుకుని చైనా ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి డేవిడ్‌ స్టిల్‌వెల్‌ చెప్పారు. భారత్-చైనా సరిహద్దుల్లో చైనా చర్యలను అమెరికా ప్రభుత్వ పాలకవర్గం నిశితంగా గమనిస్తోందని తెలిపారు. మూడేళ్ల క్రితం డోక్లాంలోనూ చైనా‌ ఇలాంటి కుట్రలే పన్నిందని చెప్పారు. పొరుగుదేశాలతో చైనా ఇటువంటి చర్యలకు పాల్పడుతుండడంపై తమ దేశం ఇప్పుడే తమ వైఖరిని ప్రకటించలేదని తెలిపారు.

చైనా ఆర్మీ వివాదాస్పద ప్రాంతంలో చాలా లోపలికి ప్రవేశించిందని, భారీగా సైన్యాన్ని మోహరించిందని చెప్పారు. చైనా ఇలా ఎందుకు చేసిందన్న విషయంపై స్పష్టత లేదని తెలిపారు. తమ ఆధిపత్యాన్ని చూపించుకోవడంలో భాగంగా లేక వ్యూహాత్మక ఎత్తుగడల్లో భాగంగా ఇటువంటి చర్యలకు పాల్పడుతుందేమోనని చెప్పారు. భారత్ విషయంతో పాటు కరోనా దక్షిణ చైనా సముద్రం, హాంకాంగ్‌, వాణిజ్య ఒప్పందాల వంటి అన్ని విషయాల్లోనూ చైనా నిబంధనల ప్రకారం నడుచుకోవట్లేదని డేవిడ్‌ స్టిల్‌వెల్‌ చెప్పారు.


తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/