మోడీ తో మీటింగ్‌.. చంద్ర‌బాబుతో డేటింగ్ అంటూ పవన్ ఫై అంబటి ట్వీట్

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ తీరుపై మంత్రి అంబ‌టి రాంబాబు త‌న‌దైన శైలీలో ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించారు. ప్రధాని మోడీ తో మీటింగ్‌..టీడీపీ నేత చంద్ర‌బాబుతో డేటింగ్ అంటూ అంబ‌టి రాంబాబు ట్వీట్ చేశారు. విశాఖ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన మోడీ తో పవన్ కళ్యాణ్ భేటీ కావడం పట్ల అంబ‌టి రాంబాబు ఈ విధంగా ట్వీట్ చేయడం జరిగింది.

రెండు రోజుల పర్యటన నిమిత్తం మోడీ శుక్రవారం సాయంత్రం విశాఖ కు చేరుకున్న సంగతి తెలిసిందే. విశాఖ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న ప్రధానికి..సీఎం జగన్ , గవర్నర్ బిశ్వభూషణ్ హరిచంద్రన్ స్వాగతం పలికారు. ఐఎన్ఎస్ డేగా ల్యాండయిన మోడీ.. అక్కడినుంచి మారుతి జంక్షన్ వరకు రోడ్ మార్గంలో వెళ్లారు. విశాఖ వాసులకు కారునుంచి అభివాదం చేస్తూ.. ముందుకు సాగారు. అనంతరం ఐఎన్ఎస్ చోళాకు చేరుకున్న మోడీ.. జనసేన అధినేత పవన్‌తో భేటీ అయ్యారు. దాదాపు వీరిద్దరూ అరగంట సేపు సమావేశమయ్యారు. పవన్‌ కళ్యాణ్‌తో పాటు జనసేన పీఏసీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. సమావేశం అనంతరం హోటల్ వెలువల మీడియా ప్రతినిధులతో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఏపీకి త్వరలో మంచి రోజులు వస్తాయని వ్యాఖ్యానించారు.

‘రెండు రోజుల కిందట నాకు పీఎంవో నుంచి పిలుపు వచ్చింది. అనేకసార్లు ఢిల్లీ వెళ్లినా ప్రధానిని కలవలేదు. 2014లో ప్రమాణ స్వీకారానికి ముందు ఆయణ్ని కలిశాను. ఆ తర్వాత ప్రధానిని ఎప్పుడూ కలవలేదు. 8 ఏళ్ల తర్వాత ఇప్పుడే కలవడం. ప్రత్యేక పరిస్థితుల్లో కలిసిన మీటింగ్ ఇది. మీటింగ్ వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం.. ప్రధాని ఆకాంక్ష కూడా ఒక్కటే. ఆంధ్రప్రదేశ్ బాగుండాలి. ఏపీ అభివృద్ధి చెందాలి. తెలుగు ప్రజల ఐక్యత బాగుండాలి’ అని పవన్ కళ్యాణ్ అన్నారు.

రాష్ట్రానికి సంబంధించిన అన్ని విషయాలను మోడీ అడిగి తెలుసుకున్నారని పవన్ తెలిపారు. తనకు అవగాహన ఉన్నంత మేరకు తెలియజేశానని చెప్పారు. ‘భవిష్యత్తులో ఇది ఏపీకి మంచి రోజులు తీసుకొస్తుందని నమ్ముతున్నాను’ అంటూ పవన్ అక్కడ నుంచి వెళ్లిపోయారు.