చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై విచారణ ప్రారంభం

ప్రభుత్వం తరపున వాదనలు వినిపిస్తున్న ఏఏజీ పొన్నవోలు

acb-court-hearing-arguments-in-chandrababu-bail-and-custody-petitions

అమరావతిః స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టిడిపి అధినేత చంద్రబాబు బెయిల్ పిటిషన్, సీఐడీ కస్టడీ పిటిషన్లపై విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణ ప్రారంభమయింది. ప్రభుత్వం తరపున ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపిస్తున్నారు. చంద్రబాబు కుట్రపూరితంగానే నేరానికి పాల్పడ్డారని కోర్టుకు పొన్నవోలు తెలిపారు. డొల్ల కంపెనీల ద్వారా టీడీపీ అకౌంట్లలోకి నిధులను మళ్లించారని చెప్పారు. టిడిపి ఆడిటర్ వెంకటేశ్వర్లును విచారించాల్సి ఉందని చెప్పారు. స్కిల్ కార్పొరేషన్ కు కూడా ఆయనే ఆడిటర్ గా పని చేశారని తెలిపారు. 10వ తేదీన సీఐడీ విచారణకు రావాలని వెంకటేశ్వర్లుకు నోటీసులిచ్చామని చెప్పారు.

చంద్రబాబు తరపున ప్రమోద్ కుమార్ దూబే వాదనలు వినిపిస్తున్నారు. పొన్నవోలు వాదనలపై దూబే అభ్యంతరం వ్యక్తం చేశారు. చంద్రబాబును ఇప్పటికే రెండు రోజుల కస్టడీకి తీసుకున్నారని.. విచారణకు చంద్రబాబు పూర్తిగా సహకరించారని చెప్పారు. కస్టడీ ముగిసినా ఇంత వరకు కేసు డైరీని సమర్పించలేదని తెలిపారు. దీంతో, కేసు డైరీ ఎక్కడుందని సీఐడీ అధికారులను జడ్జి ప్రశ్నించారు. చంద్రబాబును మళ్లీ కస్టడీకి కోరడంలో అర్థం లేదని చెప్పారు.