చంద్రయాన్‌-3 ప్రయోగానికి సర్వం సిద్ధం.. రేపే నింగిలోకి

గురువారం ప్రారంభం కానున్న కౌంట్‌డౌన్

all-set-in-place-for-today’s-chandrayaan-3

శ్రీహరికోట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపడుతున్న చంద్రయాన్-3 ప్రయోగానికి సర్వం సిద్ధమైంది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్‌లో (షార్) ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. శుక్రవారం మధ్యాహ్నం 2:35:13 గంటలకు రెండో ప్రయోగ వేదిక నుంచి ఎల్‌వీఎం-3పీ4 రాకెట్ నింగిలోకి దూసుకువెళ్లనుంది. గురువారం 2:35:13 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభమవుతుంది .

ప్రయోగాన్ని పర్యవేక్షించేందుకు ఇస్రో అధిపతి డా. సోమనాథ్ షార్‌కు చేరుకున్నారు. భాస్కరా అతిథి భవనంలో శాస్త్రవేత్తలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో చంద్రయాన్-3 ఉపగ్రహ ప్రాజెక్టు డైరెక్టర్ వీరముత్తువేల్, ఎల్‌వీఎం-3పీ4 మిషన్ డైరెక్టర్ ఎస్. మోహన్‌కుమార్, అసోసియేట్ మిషన్ డైరెక్టర్ నారాయణ్, వెహికిల్ డైరెక్టర్ బిజూస్ థామస్ పాల్గొన్నారు.

కాగా, ప్రయోగంలో మూడు మాడ్యూల్స్‌

ప్రొపల్షన్‌ మాడ్యూల్‌: రాకెట్‌ను నింగిలోకి తీసుకుపోయే మాడ్యూల్‌ ఇది. ఈ మాడ్యూల్‌.. రాకెట్‌ను భూ కక్ష్యలోకి ప్రవేశపెట్టి వేరుపడిపోతుంది.

ల్యాండర్‌ మాడ్యూల్‌: చంద్రుడిపైకి రోవర్‌ను మోసుకెళ్లి దించేది ఇదే. రాకెట్‌ నుంచి విడిపోయిన తర్వాత నిర్ణీత సుదూర కక్ష్యకు చేరుకొని చంద్రుడివైపు ప్రయాణిస్తుంది. చంద్రుడి ఉపరితలం నుంచి 100 కి.మీ ఎత్తులోని కక్ష్యలోకి చేరుకొంటుంది. దక్షిణ ధ్రువం వద్ద ఉపరితలంపై ల్యాండర్‌ దిగగానే రోవర్‌ బయటకు వస్తుంది.

రోవర్‌: చంద్రుడి ఉపరితలాన్ని అధ్యయనం చేసేందుకు రూపొందించిన పరికరమే రోవర్‌. ఇది చందమామపై ఉన్న మట్టి, మంచును పరిశీలించి సమాచారాన్ని భూమికి చేరవేస్తుంది. ఈ రోవర్‌ జీవితకాలం 14 రోజులు. రంభ-ఎల్పీ, సీహెచ్‌ఏఎస్టీఈ పరికరాలు వాతావరణంలో ప్లాస్మా ఆయాన్లు, ఎలక్ట్రాన్ల సాంద్రతను, నీటి జాడలను సీహెచ్‌ఏఎస్టీఈ గుర్తిస్తుంది.

40 రోజుల ప్రయాణం..

40 రోజుల తర్వాత చంద్రయాన్‌-3 చంద్రుడిని చేరుకొంటుంది. రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లిన 16 నిమిషాల తర్వాత ప్రొపల్షన్‌ మాడ్యూల్‌ విడిపోతుంది. ఆ తర్వాత ల్యాండర్‌ భూమి చూట్టూ దీర్ఘ వృత్తాకార కక్ష్యలో తిరుగుతుంది. అత్యంత సమీపంగా 170 కిలోమీటర్లు, అత్యంత దూరంగా 36,500 కిలోమీటర్ల కక్ష్యలో పరిభ్రమిస్తుంది. అప్పుడు భూ కక్ష్యను వదిలి చంద్రుడివైపు ప్రయాణం మొదలుపెడుతుంది. చంద్రుడిని చేరుకొనేందుకు 40 రోజులు పడుతుంది. దీనికి అతి తక్కువ ఇంధనమే అవసరం పడుతుంది. దీంతో ప్రయోగం ఖర్చు కూడా చాలా తగ్గుతుంది.