దేశ రాజధాని ఢిల్లీలో భారీగా పెరిగిన వాయు కాలుష్యం

Air pollution has increased significantly in the national capital, Delhi

న్యూఢిల్లీః ఢిల్లీలో సాధారణంగానే వాయు కాలుష్యం ఎక్కువ. ఇక శీతాకాలం వస్తే అక్కడి ప్రజలు ఊపిరి పీల్చుకోలేక ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి. ఇప్పుడు అదే దుస్థితిని ఎదుర్కొంటున్నారు దిల్లీ వాసులు. ఇంకా శీతాకాలం ఆరంభం కూడా కాలేదు. అప్పుడే ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. తెల్లవారుజామున మంచు కురుస్తోంది. ఇక దిల్లీలో మాత్రం పొగమంచు కూడా కాలుష్యమైయింది. హస్తినలో రోజురోజుకు వాయు నాణ్యత పడిపోతోందని అధికారులు చెబుతున్నారు.

ఢిల్లీ, నొయిడా, గురుగ్రామ్‌లలో వాయు నాణ్యత సూచీ 221 నుంచి 341 మధ్య నమోదువుతోందని అధికారులు తెలిపారు. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రమాణాల ప్రకారం వాయు నాణ్యత సూచీ 100లోపు ఉంటే.. సంతృప్తకర స్థాయిగా.. వంద దాటితే మాత్రం అనారోగ్యానికి సూచికగా పరిగణిస్తారు. ఇప్పుడు ఢిల్లీలో అది 300 దాటడంతో పరిస్థితులు కాస్త గంభీరంగానే ఉన్నాయని అర్థమవుతోంది. ఆదివారం రోజున వాయు నాణ్యత సూచీ 309గా నమోదైనట్లు అధికారులు తెలిపారు. దీనివల్ల ఉదయాన్నే వాకింగ్, రన్నింగ్, జాగింగ్ కోసం వెళ్లే వారు శ్వాసకోశ సమస్యల బారిన పడుతున్నట్లు సమాచారం. మాస్కులు పెట్టుకుని బయటకు వెళ్లినా ఏం ప్రయోజనం ఉండటం లేదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇది ఇలాగే కొనసాగితే శీతాకాలంలో మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.