ఇంజన్ లో ఆయిల్ లీకేజీ..ఎయిర్ ఇండియా విమానం అత్యవసర ల్యాండింగ్‌

స్టాక్ హోమ్ ఎయిర్ పోర్ట్ లో అత్యవసరంగా ల్యాండింగ్

Air India Newark-Delhi flight makes emergency landing in Sweden

న్యూఢిల్లీః న్యూయార్క్-ఢిల్లీ ఎయిర్ ఇండియా విమానం (ఏఐ106) స్వీడన్ లోని స్టాక్ హోమ్ ఎయిర్ పోర్ట్ లో అత్యవసరంగా ల్యాండ్ అయింది. విమానానికి ఉన్న రెండు ఇంజన్లలో ఒకదాని నుంచి ఆయిల్ లీకేజీ కావడంతో పైలట్ అప్రమత్తమై.. లీక్ అవుతున్న ఇంజన్ ను ఆఫ్ చేశారు. సమీపంలోని స్టాక్ హోమ్ విమానాశ్రయ అధికారులకు సమాచారం ఇచ్చారు.

అనంతరం సదరు ఎయిర్ ఇండియా విమానం స్టాక్ హోమ్ ఎయిర్ పోర్ట్ లో అత్యవసరంగా ల్యాండ్ అయ్యేందుకు అనుమతి లభించింది. ల్యాండింగ్ సమయంలో మంటలు చెలరేగితే నియంత్రించేందుకు అగ్ని మాపక యంత్రాలను సిద్ధంగా ఉంచారు. ల్యాండ్ అయిన తర్వాత విమాన ఇంజన్ ను తనిఖీ చేశారు. రెండో ఇంజన్ నుంచి ఆయిల్ లీక్ అవుతుండడాన్ని గుర్తించారు. ఈ వివరాలను డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అధికారి ఒకరు వెల్లడించారు. విమానంలో 300 మంది వరకు ప్రయాణిస్తున్నట్టు సమాచారం. అందరూ క్షేమంగానే ఉన్నారు.