అన్ని వర్గాల ప్రజలను అణగ తొక్కుతూ కేసీఆర్ పాలన చేస్తుండు – ఈటెల

హుజురాబాద్ బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ మరోసారి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫై నిప్పులు చెరిగారు. అన్ని వర్గాల ప్రజలను అణగ తొక్కుతూ కేసీఆర్ పాలన చేస్తున్నాడంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. హుజూర్ నగర్‌లో నిర్వహించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 8 ఏళ్ల ప్రజా సంక్షేమ పాలనా సదస్సు బహిరంగ సభలో ఈటల రాజేందర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భాంగా ఆయన మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుంది అంటూ ప్రగల్భాలు పలుకుతూ బీఆర్ఎస్ అంటూ కొత్తగా మరో నాటకానికి తెరలేపారు. అడుగడుగునా అన్ని వర్గాల ప్రజలను అణగ తొక్కుతూ సీఎం కేసీఆర్ పాలన చేస్తున్నారు.

తెలంగాణలో జీతాలు కూడా ఇచ్చే పరిస్థితుల్లో లేదు. మధ్యాహ్న భోజనం కింద నగదును సమకూర్చే పరిస్థితి లేదు. కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం 5 లక్షల కోట్ల అప్పుల పాలైంది. పరిపాలనలో కేసీఆర్‌ పూర్తిగా విఫలమయ్యారు. విశ్వ నగరంగా పేరుగాంచిన హైదరాబాద్‌లో మహిళలకు రక్షణ లేకుండా పోతుందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే బంగారు తెలంగాణ అవుతుందేమోనని ఆశతో ఎంతో మంది ఉద్యమం చేసి రాష్ట్రాన్ని సంపాదించుకున్నారు. కానీ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని వర్గాల ప్రజలకు అన్యాయం జరిగిందని ఈటెల అన్నారు. దళితులకు సీఎం కేసీఆర్ అన్యాయం చేసి కంటితుడుపు చర్యగా దళిత బంధు పథకాన్ని తీసుకొచ్చారని ఫైర్ అయ్యారు.