సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ దాడి : ఏపీలో అసలు సూత్రధారి అరెస్ట్

సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ దాడి వెనుక ఉన్న అసలు సూత్రధారిని పోలీసులు అరెస్ట్ చేసారు. శుక్రవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఆర్మీ అభ్యర్థుల ఆందోళన హింసాత్మకంగా మారడంతో భారీ విధ్వంసం జరిగింది. నిరసనకారులను చెదరగొట్టడానికి రైల్వే పోలీసులు కాల్పులు జరపగా ఒక యువకుడు చనిపోయాడు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన విధ్వంసానికి సంబంధించి మొదటి నుంచి కుట్ర జరిగిందనే అనుమానాలు వస్తున్నాయి. పక్కా ప్లాన్ ప్రకారమే అల్లర్లకు పాల్పడ్డారని పోలీసులు గుర్తించారు. వాట్సాప్ గ్రూపుల ద్వారా చాటింగ్ చేసుకుంటూ అభ్యర్థులు రైల్వే స్టేషన్ కు వచ్చారని గుర్తించారు. తాజాగా విధ్వంసానికి సంబంధించిన కీలక సూత్రధారిని పోలీసులు అరెస్ట్ చేసారు.

నరసారావు పేట సాయి ఢిపెన్స్‌ అకాడమీ డైరెక్టర్‌ ఆవుల సుబ్బారావు. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ దాడి వెనుక అసలు సూత్రధారిగా పోలీసులు నిర్దారించారు. విద్యార్థులను రెచ్చగొట్టినట్లు పోలీసులు తేల్చారు. ఖమ్మం జిల్లాలో ఈయన్ను అదుపులోకి తీసుకున్నారు. అక్కడ నుంచి సుబ్బారావును నరసరావుపేట తరలించారు. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌పై ప్రైవేటు అకాడమీల సహకారంతోనే విద్యార్థులు విధ్వంసానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. అకాడమీల్లోనే కొంతమంది నిరసనకారులకు షల్టర్ ఇచ్చినట్లు పోలీసులు తేల్చారు. సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ ఆవుల సుబ్బారావు ఆధ్వర్యంలో ఆర్మీ విద్యార్థులు రైల్వేస్టేషన్‌కి వచ్చినట్లు పోలీసుల విచారణంలో తేలింది. విద్యార్థులకు వాటర్ బాటిల్‌లు, బటర్ మిల్క్, పులిహోర ప్యాకెట్లను ప్రైవేటు ఆర్మి కోచింగ్ అకాడమీలు సప్లై చేసినట్లు పోలీసులు గుర్తించారు. 10 ప్రైవేట్‌ డిఫెన్స్ అకాడమీలకు చెందిన నిరసనకారులు ఆందోళనలో పాల్గొన్నట్లు పోలీసులు తేల్చారు.