కాంగ్రెస్ లోకి పీజేఆర్ కుమార్తె, ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి

అధికార టిఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. దివంగత నేత పీజేఆర్ కుమార్తె, ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి కాంగ్రెస్ పార్టీ లో చేరేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 23 న ఆమె కాంగ్రెస్ కండువా కప్పుకోబోతుంది. గత కొంతకాలంగా టీఆర్‌ఎస్‌పై అసంతృప్తితో ఉన్న విజయారెడ్డి… శనివారం ఉదయం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. నిన్న సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో జరిగిన కాల్పుల్లో విద్యార్థుల మరణానికి సంబంధించి వివరణ ఇచ్చేందుకు రేవంత్ మీడియా సమావేశం ఏర్పాటు చేయగా, ఆ మీడియా సమావేశంలో రేవంత్‌తో పాటు విజయారెడ్డి పాల్గొన్నారు.

అంతకు ముందు రేవంత్ ఇంటికి వచ్చిన ఖైరతాబాద్ కార్పొరేట్… టీపీసీసీ చీఫ్‌తో మాట్లాడారు. ఈ క్రమంలో కాంగ్రెస్‌లో చేరేందుకు విజయారెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా టీఆర్‌ఎస్‌పై విజయారెడ్డి అసంతృప్తితో ఉన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల సమయంలో ఖైరతాబాద్‌ కార్పొరేటర్‌గా పీజేఆర్ కుమార్తె విజయం సాధించారు. అంతేకాకుండా జీహెచ్‌ఎంసీ మేయర్ పదవిని ఆశించారు. అయితే ఆమెకు నిరాశే మిగిలింది. జీహెచ్‌ఎంసీ మేయర్ ఎన్నికలు జరుగుతున్న సమయంలోనే వాటిని బహిష్కరించి విజయారెడ్డి మధ్యలోనే వెళ్లిపోయారు. అప్పట్లో ఈ విషయం పెద్దఎత్తున చర్చకు దారి తీసింది. అప్పటి నుంచి టీఆర్‌ఎస్‌పై విజయారెడ్డి అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. విజయారెడ్డి ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. అయితే టీఆర్‌ఎస్ పార్టీలో అది సాధ్యంకాదని విజయారెడ్డి భావించి , కాంగ్రెస్ పార్టీ లో చేరబోతున్నట్లు తెలుస్తుంది.