అగ్నిపథ్ కు వ్యతిరేకంగా పలు ప్రాంతాల్లో ఆందోళనలు..బీహార్ లో రైలుకు నిప్పు

యూపీలోనూ పలు ప్రాంతాల్లో హింసాత్మక చర్యలు

బీహార్ : ‘అగ్నిపథ్’కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు, హింసాత్మక ఘటనలు శుక్రవారం కూడా కొనసాగుతున్నాయి. బీహార్ సహా పలు రాష్ట్రాల్లో ఆందోళనకారులు రైళ్లకు నిప్పు పెట్టారు. బీహార్, ఉత్తరప్రదేశ్, తెలంగాణ, హర్యానా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో నిరసనలు అదుపు తప్పాయి. పలు చోట్ల ఆందోళనకారులు రైళ్లకు నిప్పు పెట్టారు.

యూపీలోని వారణాసిలో బస్సును ధ్వంసం చేశారు. వారణాసి కంటోన్మెంట్ రైల్వే స్టేషన్ బయట వెండింగ్ కార్ట్ లను ధ్వంసం చేశారు. బలిలాలో స్టేషన్ వద్ద ఖాళీ రైలుకు నిప్పటించారు. ఆగ్రా-లక్నో ఎక్స్ ప్రెస్ వే మార్గంలో బస్సును ధ్వంసం చేశారు. దీంతో ఆగ్రా-నోయిడా యుమునా ఎక్స్ ప్రెస్ వే 165 కిలోమీటర్ల వ్యాప్తంగా భ్రదతను కట్టుదిట్టం చేశారు.

బీహార్ లోని కుల్హారియా స్టేషన్ వద్ద అరా పాట్నా ప్యాసింజర్ రైలుకు నిప్పు పెట్టారు. నాలుగు బోగీలు దహనమయ్యాయి. దర్బంగా-న్యూఢిల్లీ సంపర్క్ క్రాంతి ఎక్స్ ప్రెస్ కు సమస్తిపూర్ రైల్వే స్టేషన్ వద్ద నిప్పు పెట్టడంతో మూడు బోగీలు కాలిపోయాయి. అలాగే, సహస్ర దర్బంగా ప్యాసింజర్ రైలుకు కూడా నిప్పు పెట్టారు. రెండు బోగీలు దహనమయ్యాయి. విక్రమ్ శిల ఎక్స్ ప్రెస్ కూడా అగ్నికి ఆహుతైంది. బెట్టియాలోని బీహార్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి రేణు దేవి నివాసంపైనా ఆందోళనకారులు దాడికి యత్నించారు.

హర్యానాలోని ఫరీదాబాద్ బల్లబ్ గఢ్ ప్రాంతంలో ఆందోళనకారులు హింసాత్మక చర్యలకు దిగడంతో ఇంటర్నెట్, ఎస్ఎంఎస్ సేవలు నిలిపివేశారు. తెలంగాణలోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లోనూ ఆందోళనకారులు హింసాత్మక చర్యలకు దిగారు. పోలీసులపైకి రాళ్లు రువ్వారు. ఒక రైలుకు నిప్పు పెట్టారు. దీంతో సికింద్రాబాద్ కు వచ్చే రైళ్లు అన్నింటినీ అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/