ఢిల్లీలోని అఫ్గానిస్థాన్ ఎంబసీ మూసివేత

భారత ప్రభుత్వం నుంచి ఆశించిన సహకారం అందకపోవడంతోనే మూసివేత

afghanistan-shuts-embassy-in-delhi

న్యూఢిల్లీః ఢిల్లీలోని అఫ్గానిస్థాన్ ఎంబసీ మూతపడింది. 2023 నవంబర్‌ 23 నుంచి దేశంలో తమ దౌత్య కార్యకలాపాలు నిలిచిపోనున్నట్లు అఫ్గానిస్థాన్‌ గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎంబసీ తెలిపింది. సెప్టెంబర్‌ 30 నుంచే అఫ్గాన్‌ ఎంబసీ కార్యకలాపాలు భారత్‌లో నిలిచిపోయినా.. భారత ప్రభుత్వం నుంచి ఆశించిన సహకారం అందకపోవడంతో శాశ్వత మూసివేతకు నిర్ణయం తీసుకున్నట్లు ఎంబసీ తన ప్రకటనలో పేర్కొంది. ఈ సందర్భంగా భారత్‌లోని అఫ్గాన్‌ పౌరులకు ఎంబసీ కృతజ్ఞతలు తెలుపుతూ.. తమను అర్థం చేసుకొని సహకరించారని కోరింది.

మరోవైపు.. దౌత్య అధికారుల్లో కొంత మంది తాలిబన్‌ ప్రభుత్వానికి విధేయత ప్రకటించటంతో అంతర్గత కలహాలు తలెత్తినట్లు ఆరోపణలు వచ్చే అవకాశం ఉందని ఎంబసీ తెలిపింది. ఇదే దిల్లీలో రాయబార కార్యాలయ మూసివేతకు కారణమనే వార్తలూ రావొచ్చని.. కానీ, తమ విధానాల్లో విస్తృత మార్పుల వల్లే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని స్పష్టం చేసింది. గత రెండేళ్ల నుంచి భారత్‌లో అఫ్గాన్‌ వాసుల సంఖ్య గణనీయంగా పడిపోయిందని.. శరణార్థులు, విద్యార్థులు, వ్యాపారాలు దేశాన్ని వీడారని వెల్లడించింది. అలాగే 2021 ఆగస్టు తర్వాత చాలా పరిమిత సంఖ్యలో కొత్త వీసాలను జారీ చేసినట్లు పేర్కొంది.