CID కాల్‌డేటా పిటిషన్ ను కొట్టేసిన ఏసీబీ కోర్ట్

chandra-babu-Naidu
chandra-babu-Naidu

చంద్రబాబు తరుపు లాయర్లు వేసిన CID కాల్‌డేటా పిటిషన్ ను ఏసీబీ కోర్ట్ కొట్టేసింది. అధికారుల కాల్ డేటా రికార్డులను భద్రపరచాలంటూ చంద్రబాబు తరఫున న్యాయవాదులు వేసిన పిటిషన్‌ను విజయవాడ ఏసీబీ కోర్టు కొట్టేసింది. ఈ కేసులో సీఐడీ తరఫున వివేకానంద, చంద్రబాబు తరఫున దమ్మాలపాటి శ్రీనివాస్‌లు తమ తమ వాదనలు వినిపించారు. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. ప్రాసిక్యూషన్ వాదనతో ఏకీభవించి పిటీషన్‌ను కొట్టేసింది.

చంద్రబాబును అరెస్టు చేసే సమయానికి ముందు సీఐడీ అధికారులు పలువుర్ని ఫోన్‌ ద్వారా సంప్రదించారని, ఆ వివరాలు తెలిస్తే అరెస్టులో కీలక విషయాలు బయటపడతాయని ఆయన తరఫు లాయర్లు విచారణ సందర్భంగా వాదనలు వినిపించారు. దర్యాప్తు సమయంలో కేసుకు సంబంధించి అధికారులు.. పలువురిని సంప్రదిస్తుంటారని సీఐడీ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఆ సమయంలో అధికారుల కాల్‌డేటా ఇవ్వడం గోప్యతకు భంగమని, ఆ ప్రభావం విచారణపై పడుతుందని వాదించారు. ఈ కేసులో ఈనెల 27న వాదనలు పూర్తికాగా.. ఏసీబీ కోర్టు తీర్పును రిజర్వ్‌ చేసింది. ఈ పిటిషన్‌ను కొట్టివేస్తూ నేడు తీర్పు వెల్లడించింది.