అబ్దుల్‌ కలామ్‌కు అందరి సలామ్‌

నేడు వర్థంతి

Abdul Kalam
Abdul Kalam

దేశం గర్వించదగ్గ గొప్ప వ్యక్తుల్లో అబ్దుల్‌ కలాం ఒకరు. ఆయన జీవితం నేటి యువతకు ఆదర్శం.

సామాన్య కుటుంబంలో జన్మించి రాష్ట్రపతి గా ఎదిగిన ఆయన అత్యున్నత పదవిలోనూ నిరాడంబర జీవి తాన్ని గడిపారు.

11వ రాష్ట్రపతి అయిన డాక్టర్‌ ఎపిజె అబ్దుల్‌ కలాం పూర్తి పేరు డాక్టర్‌ అవ్ఞల్‌ పకీర్‌ జైనులబ్దీన్‌ అబ్దుల్‌ కలామ్‌.

తమిళనాడు రాష్ట్రం రామేశ్వరం, రామనాధపురం జిల్లా ధనుష్కోటిలో అక్టోబరు 15, 1931న ఒక పేద ముస్లిం కుటుంబంలో జన్మించారు. తండ్రి జైనులబ్దీన్‌ పడవ నడిపే యజమాని కాగా తల్లి ఆశ గృహిణి. కుటుంబ అవసరాల కోసం పేద కుటుంబం కావడంతో చిన్నప్పుడే చిన్న చిన్న పనులు చేయడం ప్రారంభించారు.

కలామ్‌ శాఖాహారి, మద్యపాన వ్యతిరేకి. బ్రహ్మచారి. వ్యక్తిగత క్రమశిక్షణలకు ఎంతో ప్రాధాన్యతనిస్తారు. ప్రజలు తమ భార్యాపిల్లలకు, తమ పిల్లల పిల్లలకూ ఆస్తులు సంపాదించి పెట్టడం కోసమే అవినీతి పరులవ్ఞతారంటూ ఆయనచెప్పేవారు.

ఇస్లాం ప్రకారమైతే ప్రతి ముస్లిం పెళ్లి చేసుకోవాలి. అయితే ముస్లిం అయిన కలామ్‌ పెళ్లి చేసుకోకపోవడం నిజంగా ప్రశంసనీయమే. ఖురాన్‌తో పాటు భగవద్గీతను కూడా చదువ్ఞతారు. మత ఘర్షణలను నిరసిస్తూ శాంతి కాముకుడుగా పేరొందారు.

గొప్ప మానవతా వాదిగా నిలిచారు. స్నానం చేసి రాకపోతే తమ మాస్టారు ట్యూషన్‌ చెప్పరనే కారణంగా వేకువనే స్నానం చేసి ట్యూషన్‌ కు వెళ్లడం ఆయన శ్రద్ధాసక్తులకు గీటురాయి. ట్యూషన్‌ నుంచి వచ్చేసరికి తండ్రి కలామ్‌ను నమాజ్‌కు తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యేవారు.

నమాజ్‌ పూర్తయ్యాక మద్రాస్‌ రైల్వేస్టేషన్‌ కెళ్లి దినపత్రికల పార్శిళ్లను తీసుకొని పంపిణీచేసేవారు. సగటు విద్యార్థిగానే చదివిన స్కూలులో గుర్తింపు పొందారు.

రామ నాధపురం పాఠశాలలో ప్రాథమిక విద్య, అనంతరం 1954లో తమ తిరుచిరాపల్లిలో జోసెఫ్స్‌కళాశాలలో భౌతికశాస్త్ర పట్టాను అందుకున్నారు.

1955 లో మద్రాసులో ఏరోనా టిక్స్‌ఇంజినీరింగ్‌విద్యను అభ్యసించారు. అప్పుడే ఖర్చుల కోసం కలామ్‌ అక్క బంగారు గాజులు అమ్మి డబ్బులివ్వడం పేర్కొనదగినది.

అలాంటి స్థితి నుంచి స్వయం కృషితో తరువాతి కాలంలో అత్యున్నత శిఖరాలు అధిరోహిం చారు. 1960లో ఇంజినీరింగ్‌ డిగ్రీ పొందాక రక్షణ సంస్థ డిఆర్‌డిఒలో శాస్త్రవేత్తగా చేరారు.

భారత సైన్యం కోసం ఒక చిన్న హెలికాప్టర్‌ తయారు చేయడం ద్వారా తన వృత్తికి శ్రీకా రం చుట్టారు. 1962లో అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రోకు మారారు.

1969లో మొట్టమొదటి స్వదేశీ ఉపగ్రహప్రయోగ వాహనం (ఎస్‌ఎల్‌వి-3) ప్రయోగ డైరెక్టర్‌గా ఉన్నారు.

ఇదే స్ఫూర్తితో 1980లో రోహిణి ఉపగ్రహ ప్రయోగంలో కృతకృ త్యులయ్యారు. 1992జులైలో భారత రక్షణమంత్రికి సాంకేతిక సలహాదారుగా నియమితులు గావడం గొప్ప విశేషమే.

కలామ్‌ కృషి ఫలితంగానే 1998లో పోఖ్రాన్‌ అణుపరీక్షలు విజయ వంతంగా జరిగాయి. ఈ అణుపరీక్షలు భారతదేశాన్ని అణ్వస్త్ర రాజ్యాల సరసన చేర్చాయి

. ఈ ప్రక్రియలో కలాం రాజకీయ, సాంకేతిక పాత్రను నిర్వహించడం గొప్ప ముందడుగే. అణుపరీక్షల సమయంలో అగ్రశ్రేణి శాస్త్రవేత్తగా ఆయన ప్రజల్లో ప్రాముఖ్యం పొందారు.

1998లో కార్డియాలజిస్ట్‌ డాక్టర్‌ సోమరాజుతో కలిసి కలాం తక్కువ ధర ఉండే స్టెంట్‌ను అభివృద్ధి చేయడం మరో ప్రశంసనీయ పరిణామంగా చెప్పుకోవచ్చు.

2012లో గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సంరక్షణ కోసం టాబ్లెట్‌ పిసిని రూపొందించడంలో ఆయన కృషి గణనీయమైనదే. త

న సుదీర్ఘకాలం శ్రమించి కృషి చేసి, అభివృద్ధి చేసిన అణ్వాయుధ కార్యక్రమం. ప్రపంచ ప్రబలశక్తిగా భారతదేశాన్ని సుస్థిరం చేసే సాధనాల్లో ఒకటిగా ఉండాలని అభిలషించే వారాయన.

యువతను వెన్ను తట్టి ప్రోత్సహించే ఉద్దేశంతో పాఠకుల్ని ఉత్తేజితుల్ని చేసే తన ఆత్మకథ వింగ్స్‌ ఆఫ్‌ ఫైర్‌ లాంటి బోలెడన్ని పుస్తకాలను రాశారు.

భారతదేశపు మూడు అత్యున్నత పురస్కారాలైన పద్మభూషణ్‌ (1981లో) పద్మవిభూషణ్‌ (1990లో) భారతరత్న (1997లో) అవార్డులు కలామ్‌ సొంతమయ్యాయి.

వీటికి తోడు 40 విశ్వవిద్యాలయాల నుంచి గౌరవ డాక్టరేట్లు లభించాయి.

జులై 18, 2002న బ్రహ్మాండమైన ఆధిక్యతతో 90శాతంపైగా ఓట్లతో 11వ భారత రాష్ట్రపతిగా విజయకేతనం ఎగురవేశారు.

భారతమాత ముద్దుబిడ్డ, మహనీయుడు అబ్దుల్‌కలాం తన 84వ ఏట జులై 27, 2015న హఠాన్మరణానికి గురయ్యారు.

షిల్లాంగ్‌లో విద్యార్థుల్ని ఉద్దేశించి ప్రసంగిస్తున్న ఆయన హఠాత్తుగా ప్రసంగం మధ్యలో కుప్పకూలిపోయి అస్తమించడం ఓ విషాదం. ప్రపంచ చరిత్రలో ఆయన అజరామరం.

భారతీయుల గుండెల్లో ఆయన మిసైల్‌తాతే. ఆయన తీపి గుర్తులకు సేవలకు సలామ్‌!

-చెన్నుపాటి రామారావు

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/