రాజ్యసభ నుంచి ఆప్‌ ఎంపీ రాఘవ్‌ చద్దా సస్పెండ్‌

సంతకాలు ఫోర్జరీ చేసినట్టు ఆప్‌ ఎంపీపై ఆరోపణలు

AAP MP Raghav Chadha suspended from Rajya Sabha over signatures forgery allegations

న్యూఢిల్లీ: రాజ్యసభ నుంచి ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) ఎంపీ రాఘవ్‌ చద్దా సస్పెండ్‌ అయ్యారు. ఐదుగురు రాజ్యసభ సభ్యుల సంతకాలను ఆయన ఫోర్జరీ చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. రాఘవ్‌ చద్దా ప్రతిపాదించిన సెలెక్ట్‌ కమిటీ తీర్మానంపై ఉన్న సంతకాలు తమవి కావని బిజెపి ఎంపీలు ఎస్‌ ఫాంగ్నోన్ కొన్యాక్, నరహరి అమీన్, సుధాన్షు త్రివేది, ఏఐఏడీఎంకే ఎంపీ తంబిదురై, బీజేడీ ఎంపీ సస్మిత్ పాత్ర తెలిపారు. తమ అనుమతి లేకుండా ఆ కమిటీలో తమ పేర్లను ఆయన చేర్చారని, తమ సంతకాలను ఫోర్జరీ చేశారని ఆరోపించారు. తమ హక్కులకు భంగం వాటిల్లిదంటూ ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్‌ జగదీప్‌ ధంకర్‌కు ఫిర్యాదు చేశారు.

కాగా, ఆప్‌ ఎంపీ రాఘవ్ చద్దా చర్య అనైతికమని, ఆయనను సస్పెండ్‌ చేయాలంటూ రాజ్యసభ నేత పియూష్ గోయల్ శుక్రవారం ఒక తీర్మానాన్ని సభ ముందుకు తెచ్చారు. ఈ నేపథ్యంలో ఈ అంశంపై దర్యాప్తు చేస్తున్న ప్రివిలేజ్‌ కమిటీ తన నివేదిక సమర్పించే వరకు రాఘవ్‌ చద్దాను రాజ్యసభ నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్లు రాజ్యసభ చైర్మన్‌ జగదీప్‌ ధంకర్‌ సభలో ప్రకటించారు. అలాగే మరో ఆప్‌ ఎంపీ సంజయ్‌ సింగ్‌పై వచ్చిన ఆరోపణలపై ప్రివిలేజ్‌ కమిటీ నిర్ణయం తీసుకునే వరకు ఆయనపై విధించిన సస్పెన్షన్‌ను పొడిగిస్తున్నట్లు పేర్కొన్నారు.