సద్గురు జగ్గీ వాసుదేవ్‌కు బ్రెయిన్ సర్జరీ

Sadhguru Jaggi Vasudev undergoes emergency brain surgery

న్యూఢిల్లీః ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త సద్గురు జగ్గీ వాసుదేవ్‌కు ఢిల్లీలోని అపోలో ఆస్పత్రిలో బ్రెయిన్ సర్జరీ జరిగింది. గత నాలుగు వారాలుగా ఆయన తీవ్ర తలనొప్పితో ఇబ్బంది పడుతున్నారు. ఇటీవీలే ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ క్రమంలోనే సద్గురు ఢిల్లీ అపోలో ఆస్పత్రిలో చేరారు. సద్గురుకు మెదడులో బ్లీడింగ్, వాపు ఉందని గుర్తించిన అపోలో వైద్యులు ఆయనకు వెంటనే సర్జరీ నిర్వహించినట్టు తెలిపారు.

ఇదే విషయాన్ని ఇషా ఫౌండేషన్ ఒక ప్రకటనలో వెల్లడించింది. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారని, ఆరోగ్యం మెరుగుపడుతోందని న్యూరో సర్జన్లు పేర్కొన్నారు. సద్గురు మెదడులో బ్లీడింగ్ కారణంగా ఆయనకు ప్రాణాంతకమైన పరిస్థితి నెలకొందని చెప్పారు. సద్గురుకు సీటీ స్కాన్‌ చేయగా మెదడులో బ్లీడింగ్, వాపు ఉందని నిర్ధారణ అయిందని అపోలో వైద్యులు తెలిపారు.

ఇషా ఫౌండేషన్ ప్రకటన ప్రకారం.. సద్గురు నెలరోజులుగా తీవ్ర తలనొప్పి ఉన్నప్పటికీ రోజువారీ కార్యకలాపాలను కొనసాగించారు. నొప్పి తీవ్రంగా ఉన్నా ఆయన పెద్దగా పట్టించుకోలేదు. ఈ నెల 8 రాత్రిపూట మహాశివరాత్రి వేడుకలను కూడా ఆయన నిర్వహించారు. మార్చి 14వ తేదీ మధ్యాహ్నానికి ఆయన ఢిల్లీకి వచ్చినప్పుడు తలనొప్పి తీవ్రమైంది’ అని పేర్కొంది. ఇంద్రప్రస్థ అపోలో హాస్పిటల్స్‌కు చెందిన డాక్టర్ వినిత్ సూరి సలహా మేరకు.. సద్గురు అత్యవసరంగా ఎంఆర్ఐ చేయించుకున్నారు. అప్పుడు ఆయన మెదడులో భారీ రక్తస్రావం ఉన్నట్టు బయటపడినట్టు తెలిపింది.