సినిమాలకు దూరం కాబోతున్నట్లు ప్రకటించిన అమిర్ ఖాన్

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమిర్ ఖాన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏడాదిన్నర పాటు సినిమాలకు దూరం కాబోతున్నట్లు తెలిపారు. తాను నటించడం మొదలు పెట్టి 30 సంవత్సరాలు అయిందని.. ఇన్నేళ్లలో ఏదో నష్టపోయానని తన మనసుకు అనిపిస్తోందన్నారు. ఏడాదిన్నర పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చి.. తన ఫ్యామిలీతో గడపాలనుకుంటున్నానని తన నిర్ణయాన్ని తెలిపారు.

ప్రస్తుతం సినిమాలకు విరామం ఇచ్చి మా అమ్మ, పిల్లలతో గడపాలని భావిస్తున్నానని వివరించారు. కుటుంబంతో కలిసి ఆనందంగా గడపడంపైనే తాను ప్రస్తుతం దృష్టి సారిస్తున్నానని స్పష్టం చేశారు. అలాగే తన కొత్త ప్రాజెక్టు ‘చాంపియన్స్’ చిత్రంపైనా క్లారిటీ ఇచ్చారు. ఈ చిత్రానికి తాను నిర్మాతను కూడా అని ఆమిర్ వెల్లడించారు. తాను ఈ చిత్రంలో నటించికపోయినా నిర్మాతగా కొనసాగుతానని, మరొక నటుడితో చిత్రాన్ని పూర్తిచేస్తామని చెప్పారు. ఇన్నాళ్లపాటు సినిమాల గురించే ఆలోచించి, ఎంతో నష్టపోయాననిపిస్తోందని, ఇది సరైన పంథా కాదనిపిస్తోందని అభిప్రాయపడ్డారు.

ఇక అమిర్ ఖాన్ తన అద్భుతమైన నటనతో కేవలం బాలీవుడ్ ప్రేక్షకులనే కాదు అన్ని భాషల ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. విభిన్న పాత్రలతో ఎన్నో సినిమాల్లో అభిమానులను అలరించారు. ఇటీవల ‘లాల్‌ సింగ్‌ చడ్డా’తో ప్రేక్షకులను పలుకరించారు. అయితే.. ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది.