కవితను బిజెపి లో చేరమన్నారనే వార్తలపై బండి సంజయ్ కామెంట్స్

తన కుమార్తె ను కూడా బిజెపి పార్టీ లోకి రమ్మని ఆహ్వానించారని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ స్పందించారు. బండి సంజయ్ నేడు హైదరాబాద్ లో పలు మీడియా సంస్థలతో ఇష్టాగోష్టిలో మాట్లాడారు. అదే పనిగా ఢిల్లీ చుట్టూ తిరిగిన కేసీఆర్ నే తాము చేర్చుకోలేదని… కవితను ఎలా చేర్చుకుంటామని ఎదురు ప్రశ్నించారు.

ఫాం హౌస్ ఇష్యూతో సంబంధమున్న నలుగురు ఎమ్మెల్యేలు ఎంత భయపడుతున్నరో వాళ్ల మొఖాలు చూస్తేనే అర్థమైతుందని అన్నారు. సీసీ ఫుటేజ్ రిలీజ్ చేయాలన్న డిమాండ్ ను కేసీఆర్ ఎందుకు పట్టించుకోవడంలేదని బండి సంజయ్ ప్రశ్నించారు. ఆ నలుగురు ఎమ్మెల్యేలతో పాటు బ్రోకర్ల కాల్ లిస్ట్ తీస్తే కేసీఆర్ ఆడిన నాటకం నాటకం బయటపడ్తదని అన్నారు. ఇన్ని రోజులు గడిచినా ఆ నలుగురిని ఎందుకు బయటకు రానిస్తలేడో సమాధానం చెప్పాలని బండి డిమాండ్ చేశారు. కేసీఆర్ ఎలాంటి యుద్ధం చేసినా తాము సిద్ధంగానే ఉన్నామన్న సంజయ్… టీఆర్ఎస్ కంటే ముందు యుద్ధం ప్రారంభించామని తెలిపారు. ఇందులో భాగంగా ఒక్కో నియోజకవర్గంలో లక్ష ఓట్ల లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు.

కేసీఆర్ లో భయం మొదలైందన్న విషయాన్ని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు ఇప్పటికే గుర్తించారని కూడా సంజయ్ వ్యాఖ్యానించారు. అసలు టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంపై ఆ పార్టీ నేతలే నవ్వుకుంటున్నారన్నారు. బీజేపీ బలోపేతం కాకుండా అడ్డుకోవాలని, అదే సమయంలో టీఆర్ఎస్ గెలవాలని కేసీఆర్ చెబుతున్నారని ఆయన అన్నారు.