కృష్ణా నదిపై ఐకానిక్‌ బ్రిడ్జికి కేంద్రం గ్రీన్ సిగ్నల్

కృష్ణా నదిపై ఐకానిక్‌ బ్రిడ్జికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలుగు రాష్ట్రాల కృష్ణ నదిఫై రూ.1,082.56 కోట్లతో ఈ వంతెన నిర్మించనున్నట్లు కేంద్ర మంత్రి గడ్కరీ ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. ఈ మేరకు ఐకానిక్ వంతెన ఫొటోలను ట్విట్టర్ లో పంచుకున్నారు. కాగా.. దేశంలోనే తొలిసారిగా నిర్మిస్తున్న కేబుల్‌, సస్పెన్షన్‌ ఐకానిక్‌ వంతెన ఇదే కావడం విశేషం. ఇది ప్రపంచంలో 2వ, దేశంలో తొలి చరిత్రాత్మక వంతెనగా నిలవనుందని పేర్కొన్నారు. వంతెనలో పాదచారుల మార్గం గాజుతో ఏర్పాటు చేయనున్నట్టు వివరించారు. వంతెనలో గోపురం ఆకారంలో పైలాన్‌, లైటింగ్ వ్యవస్థ ఉంటుందన్నారు. చుట్టూ నల్లమల అడవులు, ఎత్తయిన కొండలు, శ్రీశైలం రిజర్వాయర్‌ పరిసరాలతో ఈ వంతెన మంచి పర్యాటక ప్రాంతంగా మారనుంది. ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని 30 నెలల్లోనే పూర్తి చేస్తామని కేంద్ర మంత్రి తెలిపారు. ఈ వంతెన నిర్మాణంతో ఎట్టకేలకు 15 ఏళ్ల చిరకాల స్వప్నం సాకారం కానుంది.

తెలంగాణలోని కొల్లాపూర్‌ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోకి రాకపోకలు సాగించాలంటే కృష్ణా నదిలో పడవ ప్రయాణం చేయాల్సిందే. ప్రమాదమని తెలిసినా ఏమీ చేయలని పరిస్థితి అక్కడి ప్రజలది. కానీ రోడ్డు మార్గంలో రావాలంటే వంద కిలోమీటర్లు ప్రయాణించాలి. 2007 లో కృష్ణానదిలో పడవ మునగిన ఘటనలో 61 మంది ప్రాణాలు కోల్పోయారు. అప్పటి నుంచి నదిపై బ్రిడ్జి నిర్మించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వంతెన నిర్మాణానికి కేంద్రం ఆమోదం వేసింది. ఈ వంతెన నిర్మాణం పూర్తయితే హైదరాబాద్‌ నుంచి కడప, చిత్తూరు, తిరుపతి వైపు ప్రయాణించేవారికి కర్నూలు మీదుగా చుట్టూ తిరిగి వెళ్లాల్సిన అవసరం ఉండదు. హైదరాబాద్‌ – తిరుపతి మధ్య 80 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది.