నిర్భయ దోషుల ‘ఉరి’పై తీవ్ర ఉత్కంఠ

నిర్భయ దోషి ఫైనల్ పిటిషన్ కొట్టివేత

Nirbhaya Convicts
Nirbhaya Convicts

న్యూఢిల్లీ: నిర్భయ దోషులకు ఢిల్లీ పాటియాలా హౌస్ కోర్టు మార్చి 3న డెత్ వారెంట్ జారీచేసిన విషయం తెలిసిందే. అయితే, దోషులు మాత్రం మరోసారి ఉరిని వాయిదా వేయించుకోవాలని చేయని ప్రయత్నం లేదు. తమకు ఉన్న న్యాయపరమైన అంశాలను దోషులు వినియోగించుకుంటున్నారు. తాజాగా, నిర్భయ దోషి పవన్ గుప్తా దాఖలు చేసిన క్యూరేటివ్ పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం సోమవారం తిరస్కరించింది. పవన్ గుప్తా పిటిషన్‌ను తిరస్కరించిన జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్, జస్టిస్ ఆర్ భానుమతి, జస్టిస్ అశోక్ భూషణ్‌ల ధర్మాసనం.. దోషికి కింది కోర్టు ఉరిశిక్ష విధించడంలో ఎలాంటి తప్పులేదని అభిప్రాయపడింది. మరోవైపు, డెత్‌ వారెంట్లపై స్టే ఇవ్వాలని కోరుతూ నిర్భయ దోషి అక్షయ్‌ వేసిన పిటిషన్‌ను పాటియాలా హౌస్‌ కోర్టు సోమవారం కొట్టివేసింది. అక్షయ్‌ గత శుక్రవారం మరోసారి రాష్ట్రపతికి క్షమాభిక్ష అభ్యర్థన పెట్టుకున్నాడు. కొత్తగా క్షమాభిక్ష పిటిషన్‌ వేసినందున డెత్‌ వారెంట్లపై స్టే ఇవ్వాలని కోరుతూ అక్షయ్‌ న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. అయితే ఇందుకు కోర్టు నిరాకరించింది. అక్షయ్‌ గతంలో క్షమాభిక్ష అభ్యర్థన పెట్టుకోగా.. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ దాన్ని తిరస్కరించారు.

మార్చి 3న ఉదయం 6.00 గంటలకు ఉరిశిక్ష అమలుచేయాలని పాటియాలా హౌస్ కోర్టు డెత్ వారెంట్ జారీచేసినా, అమలుపై మాత్రం ఉత్కంఠ కొనసాగుతోంది. పవన్ తన చివరి అవకాశం వినియోగించుకోనుండగా, ఉరి శిక్షపై మధ్యంతర ఉత్తర్వులు కోరుతూ అతడు దాఖలుచేసిన పిటిషన్ ఢిల్లీ హైకోర్టులో ఉంది. ఈ నేపథ్యంలో మంగళవారం ఉరి అమలవుతుందా? అనే సందేహం వ్యక్తమవుతోంది.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/