అయోధ్య రామయ్య ప్రతిష్ఠాపనకు 84 సెకన్ల అద్భుత ముహూర్తం

84 Seconds of Miraculous Moment for Ayodhya Ramaya’s Inauguration

న్యూఢిల్లీః అయోధ్యలో రాముడి విగ్రహ ప్రతిష్ఠాపనకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. మరోవైపు ట్రస్ట్ నిర్వాహకులు ప్రముఖులకు ఆహ్వానాలు కూడా పంపారు. అయితే అయోధ్యలో రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ఠాపనకు జనవరి 22వ తేదీ మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో మంచి ముహూర్తం ఉందని జ్యోతిషులు తెలిపారు. 84 సెకన్లపాటు శుభ గడియలు ఉన్నాయని చెప్పారు. ఆ సమయంలో ప్రతిష్ఠాపన జరిగితే దేశం పేరు మార్మోగిపోతుందని జ్యోతిషులు వెల్లడించారు. జనవరి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల 29 నిమిషాల 8 సెకన్ల నుంచి 12 గంటల 30 నిమిషాల 32 సెకన్ల మధ్య అత్యంత శుభ గడియలున్నట్లు వారణాసికి చెందిన సంగ్వేద విద్యాలయ ఆచార్యుడు, జ్యోతిషుడు ఆచార్య గణేశ్వర్‌ శాస్త్రి ద్రవిడ్‌ వివరించారు. మేష లగ్నంలో అభిజిత్‌ ముహూర్తంలో శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. మధ్యాహ్నం 12.15 గంటల నుంచి 12.45 గంటల మధ్య ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగనున్నట్లు సమాచారం.