ఆ కుటుంబాలకు చెందిన వ్యక్తే కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా ఉంటే బెటర్‌!

‘మూడ్ ఆఫ్ ది నేషన్’ సర్వేలో ప్రజల అభిప్రాయం

Rahul Gandh
Rahul Gandh

న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షుడిగా నెహ్రూగాంధీ కుటుంబాలకు చెందిన వ్యక్తే ఉంటే బెటరని ఇండియా టుడే నిర్వహించిన ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ సర్వేలో మెజారిటీ ప్రజలు అభిప్రాయపడ్డారు. దేశవ్యాప్తంగా 19 రాష్ట్రాల్లోని 194 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో గత నెల 21 నుంచి 31వ తేదీ మధ్య ఈ సర్వే నిర్వహించారు. మొత్తం 12,141 మంది ఈ సర్వేలో తమ అభిప్రాయాలను వెల్లడించారు. వీరిలో 67 శాతం మంది గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారు కాగా, 33 శాతం మంది పట్టణ వాసులు. సర్వేలో పాల్గొన్న వారిలో స్త్రీపురుషుల నిష్పత్తి సమానం. నెహ్రూగాంధీ కుటుంబాల నుంచి వచ్చిన వ్యక్తే కాంగ్రెస్ అధ్యక్ష పీఠాన్ని అధిరోహిస్తే బాగుంటుందని 49 శాతం మంది అభిప్రాయపడగా, 24 శాతం మంది రాహుల్ గాంధీనే అందుకు సరైన వ్యక్తి అని పేర్కొన్నారు. గతేడాది ఆగస్టులో ఇదే విషయమైన నిర్వహించిన సర్వేలో 11 శాతం మంది మాత్రమే రాహుల్‌కు ఓటేయగా, ఇప్పుడది 24 శాతానికి పెరగడం గమనార్హం.

ఇక ప్రియాంక గాంధీకి 14 శాతం మంది, మన్మోహన్‌సింగ్‌కు 10 శాతం, సోనియాగాంధీ‌కి 11 శాతం, సచిన్ పైలట్‌కు 7 శాతం, జ్యోతిరాదిత్య సింధియాకు 6 శాతం, చిదంబరానికి 3 శాతం మంది ఓటేశారు. సీనియర్ నేత అశోక్ గెహ్లట్ కాంగ్రెస్ చీఫ్ కావాలని కేవలం ఒక శాతం మంది మాత్రమే అభిప్రాయపడ్డారు.

తాజా తెలంగాణ ఎన్నికల వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/election-news/telangana-election-news/