హైదరాబాద్ లో డ్రైవర్ నిర్లక్ష్యానికి మూడేళ్ల బాలుడు మృతి

హైదరాబాద్ మహా నగరంలో డ్రైవర్ నిర్లక్ష్యానికి మరో మూడేళ్ల చిన్నారి మృతి చెందింది. హైదరాబాద్ లో ట్రాఫిక్ ఎలా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. గంటల కొద్దీ సమయం రోడ్ల పైనే గడిచిపోతుంది. ఈ క్రమంలో ఎవరికీ వారు త్వరగా తమ గమ్యస్థానానికి చేరుకోవాలని , ఆఫీస్ లకు చేరుకోవాలని ఆలోచిస్తూ తమ వాహనాలను స్పీడ్ గా నడుపుతూ ప్రమాదాలకు గురికావడం , ప్రమాదాలు చేయడం చేస్తుంటారు. ప్రతిహ రోజు ఎక్కడో ఓ చోట ప్రమాదం అనే వార్త కనిపిస్తూనే ఉంటుంది. తాజాగా హయత్ నగర్ పరిధిలో క్యాండర్ షైన్ హై స్కూల్ బస్ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా బాలుడు మృతి చెందాడు.

కుంట్లూర్ గ్రామానికి చెందిన విద్యార్థి బస్ ఎక్కడానికి రాగా డ్రైవర్ ఫోన్ మాట్లాడుతూ నిర్లక్ష్యంగా బాలుడి పైకి బస్ ఎక్కించాడు. ఈ ప్రమాదంలో హర్ష పవన్ అనే మూడేళ్ల (3) బాలుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. విషయం తెలుసుకున్న కాలనీ వాసులు బస్ ను అడ్డగించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో డ్రైవర్ అక్కడి నుండి పరారయ్యాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పాఠశాల యాజమాన్యం తమకు ఎలాంటి సంబంధం లేనట్లు ప్రవర్తించడం స్థానికులను కోపోద్రిక్తులను చేసింది. ఈ ప్రమాదానికి కారణమైన స్కూల్ ను వెంటనే సీజ్ చేయాలని స్థానికులు డిమాండ్ చేశారు.

మృతి చెందిన బాలుడి అక్క అదే స్కూల్లో చదువుతోంది. అక్కను స్కూల్ బస్సు ఎక్కించేందుకు ఎంతో సంతోషంగా తండ్రితోపాటు ఆ చిన్నారి బాలుడు కూడా వచ్చాడు. అయితే, ఇంతలోనే ఈ దారుణం చోటుచేసుకుంది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా, కేవలం డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే బాలుడు మరణించాడని బాధిత కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అప్పటి వరకూ ఎంతో హుషారుగా ఉన్నా ఆ చిన్నారి బాలుడు విగితా జీవిగా కనిపిస్తుండడంతో బాధిత తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.