విజయవాడ డివిజన్‌లో 27 నుంచి డిసెంబర్ 3 వరకు 3 రైళ్లను రద్దు

డివిజన్‌లో భద్రతా పనులు కొనసాగుతుండడంతో నిర్ణయం

train

అమరావతిః రైల్వే ప్రయాణికులకు విజయవాడ డివిజన్ కీలక సమాచారం ఇచ్చింది. డివిజన్‌ పరిధిలో చేపడుతున్న భద్రతా పనుల కారణంగా ఈ నెల 27 నుంచి డిసెంబర్ 3 వరకు 3 రైళ్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. గుంటూరు-రాయగడ ఎక్స్‌ప్రెస్‌, గుంటూరు- విశాఖ సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌, మచిలీపట్నం-విశాఖ ఎక్స్‌ప్రెస్‌ రద్దు కానున్నాయని వివరాలు తెలిపింది. పనులు పూర్తయిన తర్వాత ఈ సర్వీసులు తిరిగి ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి.

కాగా డివిజన్‌లో పనుల కారణంగా ఇప్పటికే పలు రైలు సర్వీసులను అధికారులు రద్దు చేశారు. ఈ మేరకు ఇప్పటికే 28 నుంచి డిసెంబర్‌ 4 మధ్య మూడు రైళ్లు రద్దు కానున్నాయని ప్రకటించారు. రాయగడ-గుంటూరు ఎక్స్‌ప్రెస్‌, విశాఖ-గుంటూరు సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌, విశాఖ-మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్‌‌లు రద్దు చేయనున్నట్టు వెల్లడించారు. నవంబర్‌ 27, 28, 29, డిసెంబర్‌ 1, 2 తేదీల్లో విజయవాడ-విశాఖ రైలు, విశాఖ-విజయవాడ ఉదయ్‌ ఎక్స్‌ప్రెస్‌ రద్దు కానున్నాయని ప్రకటించారు. కాగా భద్రతా పనులు పూర్తయిన వెంటనే రైళ్లు యథావిథిగా నడవనున్నాయి.