మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. గిర్డర్ లాంచర్ మెషీన్ కూలి 15 మంది మృతి

పిల్లర్లతో అనుసంధానించే గిర్డర్ యంత్రం కార్మికులపై పడటంతో ఘోర ప్రమాదం

15-dead-after-girder-launcher-used-for-bridge-construction-collapses-in-thane

ముంబయిః మహారాష్ట్రంలో ఈ తెల్లవారుజామున ఘోర ప్రమాదం సంభవించింది. బ్రిడ్జ్ నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన గిర్డర్ అకస్మాత్తుగా కూలడంతో ఏకంగా 15 మంది మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. థానే జిల్లా షాపూర్‌లో సమృద్ధి ఎక్స్‌ప్రెస్ హైవే ఫేస్-3 రోడ్డు పనులకు సంబంధించి బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టారు. ఇందుకోసం ఏర్పాటు చేసిన గిర్డర్ యంత్రం ఒక్కసారిగా కార్మికులపై పడింది.

పిల్లర్లతో అనుసంధానించే ఈ యంత్రం వంద అడుగుల ఎత్తు నుంచి పడినట్టు తెలుస్తోంది. సమాచారం అందగానే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతులు, గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. కాగా, మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలాన్ని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే, ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ పరిశీలించారు.

కాగా, సమృద్ధి మహామార్గ్‌ ను నాగ్‌పూర్‌-ముంబై మధ్య నిర్మిస్తున్నారు. మొత్తం 701 కిలోమీటర్ల పొడవైన ఈ రహదారిని డిప్యూటీ సీఎం ఫడ్నవీస్‌ కళల ప్రాజెక్టుగా పేర్కొంటారు. ఇప్పటికే ఈ ఎక్స్‌ప్రెస్‌ వేలో రెండు దశలు పూర్తయ్యాయి. మే 26న రెండో దశలో భాగంగా నిర్మించిన నాసిక్‌లోని షిర్డీ-భర్వీర్‌ మధ్య నిర్మించిన మార్గాన్ని సీఎం షిండే ప్రారంభించారు. దీంతో సమృద్ధి మహామార్గ్‌లో 600 కిలోమీటర్లు అందుబాటులోకి వచ్చినట్లయింది.