లోయలో పడిన కారు.. 10 మంది దుర్మరణం

10 dead as taxi rolls down gorge on Jammu-Srinagar National Highway

శ్రీనగర్‌ః జమ్మూ – శ్రీనగర్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ కారు అదుపు తప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో పది మంది దుర్మరణం చెందారు. ఈ వాహనం శ్రీనగర్ నుంచి జమ్మూకు వెళ్తుండగా, బ్యాటరీ చెష్మా ప్రాంతంలో ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. ఇవాళ తెల్లవారుజామున 1.15 గంటలకు 300 అడుగుల లోయలో పడిపోయినట్లు తెలుస్తోంది.

ప్రమాద సమాచారం అందిన వెంటనే స్టేట్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌(ఎస్‌డీఆర్‌ఎఫ్‌), సివిల్‌ క్విక్‌ రెస్పాన్స్‌ టీమ్‌(క్యూఆర్టీ) ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. శ్రీనగర్ పరిసరాల్లో భారీ వర్షాలు కూరుస్తున్నప్పటికీ సహాయక బృందాలు 10 మంది ప్రయాణికుల మృత దేహాలను వెలికితీసాయి. కారు డ్రైవర్ను జమ్మూలోని అంబ ఘ్రోథాకు చెందిన బల్వాన్ సింగ్ (47)గా గుర్తించారు. మిగతా మృతుల వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. మరోవైపు ఘటనకు గల కారణాలను దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.