చెడ్డీ గ్యాంగ్ ఎక్కడ దోపిడీ చేయాలో సలహా ఇచ్చిన జనసేన నేత

ఏపీలో గత కొద్దీ రోజులుగా చెడ్డీ గ్యాంగ్ హల్చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో చెడ్డీ గ్యాంగ్ ఎక్కడ దోపిడీ చేయాలో సలహా ఇచ్చి వార్తల్లో నిలిచారు జనసేన నేత పోతిన మహేష్. నగర శివారులో ఉండే సామాన్య, మధ్యతరగతి కుటుంబాలపై దాడి చేసి దోచుకుంటే ఉపయోగం ఉండదని.. ఈ రాష్ట్రంలో దోచుకోవాల్సింది మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, సలహాదారుల ఇళ్లలో అన్నారు. వారి దగ్గర దోచుకుంటే వేల కోట్ల రూపాయల డబ్బులు దొరుకుతాయన్నారు.. వెళ్లి వాళ్ల దగ్గర దోచుకోండి దాచుకోండి అంటూ సలహా ఇచ్చారు. నగర శివారుల్లో ఉండే సామాన్యులపై దాడి చేయడం సమంజసం కాదన్నారు.

ఎస్సీ, ఎస్టీల మీద తిరిగి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం పెట్టి జైలుకు పంపుతారు కానీ విగ్రహాలు కూల్చే వాళ్ల మీద, ప్రజా ధనం లూటీ చేసేవారిని, రథాలు తగలబెట్టేవాళ్లను పట్టుకుని కేసులు పెట్టరన్నారు. చెడ్డీ గ్యాంగ్‌పై కూడా పెద్దగా కేసులు పెట్టరని భావిస్తున్నానని.. అందుకే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, సలహాదారుల ఇళ్లలో దోచుకోవాలన్నారు. ముఖ్యంగా మంత్రి వెల్లంపల్లి ఇంట్లో దోపిడీకి వెళితే వందల కోట్ల రూపాయలు ఉంటాయని.. అది కూడా రెండు వేల రూపాయల నోట్లు కట్టలకు కట్టలు దొరుకుతాయన్నారు.

రాత్రి ప‌డితే చాలు చెడ్డీలు ధరించి, చేతుల్లో మార‌ణాయుధాలు ప‌ట్టుకొని సంచరిస్తారు. అడ్డోస్తే అక్కడికక్కడే దాడులకు తెగబడి హతమారుస్తారు. అడ‌వాళ్లు క‌నిపిస్తే అత్యాచారాలకు బరితెగిస్తారు. గత కొంతకాలంగా హైదరాబాద్ శివార్లలో హడలెత్తిస్తున్న ఈ గ్యాంగ్..ఇప్పుడు ఏపీ ఫై ఫోకస్ పెట్టారు. ఈ నెల 1న అర్ధరాత్రి కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లిలో ఓ అపార్ట్‌మెంట్‌లో చోరీకి యత్నించిన చెడ్డీగ్యాంగ్.. ఈ నెల 3న తాడేపల్లిలో ముఖ్యమంత్రి జగన్ నివాసానికి కిలోమీటరు దూరంలో ఉన్న నవోదయ కాలనీలోని రెయిన్‌బో విల్లాల్లోకి ప్రవేశించినట్టు సీసీ కెమెరాల్లో రికార్డయింది. చెడ్డీగ్యాంగ్‌కు చెందిన వారిగా భావిస్తున్న ఐదుగురు దుండగులు గడ్డపారలతో తలుపులు పగలగొట్టి 37, 39, 44 నంబరు విల్లాల్లోకి చొరబడ్డారు.