డబ్బు, కాంట్రాక్టులిచ్చి చేర్చుకునే సంస్కృతి బీజేపీది కాదు – బండి సంజయ్

డబ్బు, కాంట్రాక్టులిచ్చి నేతలను బిజెపి లో చేర్చుకునే సంస్కృతి కాదన్నారు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. రాజగోపాల్ రెడ్డి బిజెపి ఇచ్చే కాంట్రాక్టుల కోసమే కాంగ్రెస్ పార్టీ ని వీడారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ ను ఖండించారు బండి సంజయ్. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ డబ్బు, కాంట్రాక్టులిచ్చి చేర్చుకునే సంస్కృతి బీజేపీది కాదన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన రాజ్‌గోపాల్‌, దాసోజు ఎందుకు పార్టీ మారుతున్నారో అర్థం చేసుకోవాలన్నారు. కాంగ్రెస్ నేత సోనియాను తిట్టినవారే ఇప్పుడు పీసీసీ చీఫ్‌ అయ్యారని సంజయ్ అన్నారు.

ఇదిలా ఉంటె నిన్న కాంగ్రెస్ పార్టీ కి రాజీనామా చేసిన దాసోజు శ్రవణ్..బిజెపి చేరడం ఖాయమైంది. ఈ విషయాన్నీ బీజేపీ తెలంగాణ ఇన్‌చార్జ్‌ తరుణ్‌చుగ్‌ తెలిపారు. ఈరోజు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో ఢిల్లీ వెళ్లిన దాసోజు శ్రవణ్..తరుణ్‌చుగ్‌ తో భేటీ అయ్యారు. అనంతరం తరుణ్ చుగ్‌ మాట్లాడుతూ.. శ్రవణ్ బీజేపీలో చేరబోతున్నారని తెలిపారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజాదరణ కోల్పోతోందని, తెలంగాణను కేసీఆర్ ప్రభుత్వం దోచుకుంటోందని మండిపడ్డారు. కాంగ్రెస్ కేసీఆర్‌కు బీటీమ్‌గా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. రానున్న రోజుల్లో బీజేపీలో మరిన్ని చేరికలుంటాయని తరుణ్‌చుగ్‌ తెలిపారు.