కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి క్షమాపణ తెలిపిన అద్దంకి దయాకర్

ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి క్షమాపణ తెలిపారు అద్దంకి దయాకర్. మునుగోడు సభలో కోమటిరెడ్డిపై అభ్యంతకర వ్యాఖ్యలపై అద్దంకి దయాకర్ క్షమాపణ కోరారు. అసలు సభలో దయాకర్ ఏమన్నారనేది చూస్తే.. ఓ వైపు తన నియోజకవర్గంలో కాంగ్రెస్ సభ జరుగుతోంటే… కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఢిల్లీలో అమిత్ షాను కలవటమేంటని ప్రశ్నించారు.

కాంగ్రెస్ కు రాజీనామా చేసిన మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి విషయంలో తన వైఖరేమిటో చెప్పాలని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని అద్దంకి దయాకర్ డిమాండ్ చేశారు. లేకుంటే పార్టీ నుంచి బయటకు పోవాలని పరుష పదజాలంతో విమర్శించారు. దీంతో కోమటిరెడ్డి వర్గీయుల్లో తీవ్ర ఆగ్రహం, అసంతృప్తి చెలరేగాయి. అనంతరం కోమటిరెడ్డిపై వ్యాఖ్యలను నిరసిస్తూ ఆయన అనుచరులు అద్దంకి దయాకర్ దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ క్రమంలో అద్దంకి దయాకర్ క్షమాపణ కోరారు. పార్టీకి నష్టం జరగొద్దనే ఆ వ్యాఖ్యలు చేశాను తప్ప… వెంకట్ రెడ్డిని విమర్శించాలని కాదన్నారు. తెలంగాణలో ఆ పదాన్ని కామన్ గా వాడుతారన్న ఆయన… తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు.

ఇక కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సోదరుడు రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కి , తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బిజెపి లో చేరబోతున్నారు. ఈ నెల 21 న కేంద్ర మంత్రి అమిత్ షా సమక్షంలో బిజెపి కండువా కప్పుకోతున్నారు.