కొత్త పెన్షన్లపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ కీలక ప్రకటన

,

కొత్త పెన్షన్లపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ కీలక ప్రకటన చేసారు. శనివారం ప్రగతి భవన్ లో మీడియా సమావేశం ఏర్పటు చేసిన ఆయన..రాష్ట్రంలో కొత్తగా 10లక్షల మందికి పెన్షన్లు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 36లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నామని.. స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా కొత్త పింఛన్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో మొత్తం పింఛన్‌దారుల సంఖ్య 46లక్షలకు చేరుకుంటుందని తెలిపారు. 57 సంవత్సరాలున్న వారికి పింఛన్లు మంజూరు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కొత్తగా డయాలసిస్‌ పేషెంట్లకు సైతం పింఛన్లు ఇస్తున్నట్లు వెల్లడించారు. డయాలసిస్‌ పేషెంట్లకు రూ.2016 పింఛన్‌ ఇవ్వనున్నట్లు తెలిపారు.

రేపు ఢిల్లీలో జరిగే నీతి ఆయోగ్‌ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. నీతి ఆయోగ్ ఏర్పాటు చేసినప్పడు భారత్‌కు మంచి రోజులు వచ్చాయని తాను ఎంతో సంతోషించానని, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేసారు. నీతి ఆయోగ్ ఏర్పాటు చేసిన సమావేశంలో తాను కూడా ఉన్నానని, అప్పుడు ప్రధాని మాటలు తనకు ఎంతో నచ్చాయని చెప్పారు.

మేధోమధనానికి బొందపెట్టి, ప్రధానమంత్రో మరొకరో చెప్పిన మాటలకు భజన చేసే సంస్థగా మారిపోయింది. ప్లానింగ్ కమిషన్‌కు నిర్దిష్టమైన నియమనిబంధనలు ఉండేవి, రాష్ట్రాల బడ్జెట్లలో కూడా మార్గదర్శకత్వం వహించేది. కానీ నీతిఆయోగ్ అది కూడా చెయ్యలేదు. నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో, నీతి ఆయోగ్‌లో నీతి అంత ఉంది. ఏదో జరుతుందని ఆశిస్తే.. ఏం జరగలేదన్నారు.