ఎంఎస్ స్వామినాథన్‌ను భారతరత్నతో గౌరవించాలి : కేంద్రానికి తెలంగాణ సర్కారు వినతి

MS Swaminathan should be honored with Bharat Ratna: Telangana government requests Centre

హైదరాబాద్‌ః ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ భౌతికకాయానికి చెన్నైలో శనివారం మధ్యాహ్నం తమిళనాడు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. బెజంట్ నగర్ ఎలక్ట్రిక్ స్మశానవాటికలో స్వామినాథన్ కుటుంబ సభ్యులు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. చెన్నైలోని తరమణిలో డాక్టర్ స్వామినాథన్ భౌతిక ఖాయానికి తెలంగాణ ప్రభుత్వం తరఫున మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నివాళులర్పించారు. అనంతరం బెజంట్ నగర్‌లో నిర్వహించిన ఆయన అంత్యక్రియల్లో పాల్గొన్నారు.

ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్‌కు మరణానంతర భారతరత్న అవార్డుతో గౌరవించాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఇప్పటికే ఆయనకు దేశ అత్యున్న పౌరపురస్కారం భారతరత్న అవార్డు ఇవ్వడంలో ఆలస్యం జరిగిందని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ఇప్పటికైనా ఆయనకు భారతరత్న ఇవ్వడం ద్వారా శాస్త్రవేత్తలను, ఈ దేశ రైతాంగాన్ని, వ్యవసాయరంగాన్ని గౌరవించినట్లు అవుతుందని అన్నారు. ఎంఎస్ స్వామినాథన్‌కు ఇప్పటికైనా భారతరత్న అవార్డును ఇవ్వాలని తెలంగాణ రైతాంగం, తెలంగాణ ప్రభుత్వం తరఫున కేంద్రాన్ని కోరుతున్నట్లు తెలిపారు.