అవినీతిని అంతం చేయలేమా?


ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా అవినీతికి అడ్డుకట్ట పడటం లేదు. ప్రతి ఉద్యోగి ఉద్యోగంలో చేరే సమయంలో ఉన్న ఆస్తిపాస్తులు గుర్తించి తర్వాత కొంత నిర్ణీత కాలానుగుణంగా ఎప్పటికప్పుడు శాస్త్రీయ బద్ధంగా ఆస్తులను మదింపు చేసినట్లయితే ప్రయోజనం ఉంటుంది. అవినీతికి పాల్పడే అధికారులను శాశ్వతంగా ఉద్యోగం నుండి తీసివేసే చట్టం తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అవినీతి కేసుల్లో సత్వర విచారణలు జరిపి న్యాయస్థానాలు నిందితులకు కఠినశిక్షలు విధించాలి. ప్రభుత్వం శాఖాపరమైన చర్యలకు ఉపక్రమించడం చాలా అవసరం. కేసుల విచారణలో నెలల తరబడి జాప్యం, శిక్షల విషయంలో సందిగ్ధత వలన అవినీతిపరులు మరింత విచ్చలవిడితనానికి పాల్పడే అవకాశముంది. పెండింగ్‌ కేసుల విచారణ కోసం ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసి నిందితులకు వేగంగా శిక్షలు విధించాలి.ప్రతి కార్యాలయంలో అవినీతి నిరోధకశాఖ ఫోన్‌నెంబర్లను ప్రదర్శించాలి.

corruption
corruption

భ గవంతుడు సర్వాంతర్యామి అని ఆనాడు భాగవతంలో పోతనామాత్యుడు రాసిన పద్యం ప్రహ్లాదుడితో పలికించిన వర్ణన అద్భుతం. నేడు మారిన కాలమాన పరిస్థితులకు అనుగుణంగా భగవం తుడు అన్నింటా నెలకొని ఉన్నాడో లేదో తెలియదు. కానీ అవినీతి మహమ్మారి మాత్రం ప్రతిచోట తిష్టవేసి కోరలు చాస్తోంది. ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి వేళ్లూనుకుపోతోందనడానికి ప్రతినిత్యం ఏదో ఒక శాఖకు చెందిన ప్రభుత్వ ఉద్యోగి లంచం తీసుకొంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడుతుండటమే నిదర్శనంగా నిలుస్తున్నది. ప్రస్తుతం అవినీతి ఎయిడ్స్‌, కేన్సర్‌ కన్నా వేగంగా సమాజాన్ని, వ్యవస్థలను, సామాన్య ప్రజలను దహించివేస్తోంది. వేలాది రూపా యల జీతం తీసుకుంటూ ప్రభుత్వ ఉద్యోగాన్ని నిజాయితీతో ప్రజ లకు సేవచేయాల్సిన కొందరు లంచగొండులు అది చాల దన్నట్లు అధిక సంపాదనకు అడ్డదారులు తొక్కుతున్నారు.కొందరు అవినీతి అక్రమార్కుల ప్రవర్తన ఫలితంగా మొత్తం ఉద్యోగవర్గాలు సమా జంలో తలదించుకునే పరిస్థితులు కల్పిస్తున్నారు.ఉద్యోగ నిర్వ హణ, ప్రజాసేవ పక్కనపెట్టి అక్రమార్జనే అసలు పనిగా పెట్టుకొని ఉద్యోగ ధర్మాన్ని విస్మరిస్తున్నారు. అవినీతి అనకొండల దోపిడీకి సామాన్యుడు ప్రతిరోజు బలవ్ఞతూనే ఉన్నాడు. లంచాలకు రుచి మరిగిన ఉద్యోగులు ఏటా వందల మంది అవినీతి నిరోధక శాఖ కు చిక్కినా పరిస్థితిలో మార్పురావడం లేదు.ప్రభుత్వ శాఖ ఏదైనా సరే పేద ప్రజలను వదలకుండా జలగల్లా పీల్చిపిప్పి చేస్తున్నారు. గ్రామం నుంచి మొదలు దేశ రాజధాని వరకు ప్రతి రంగంలో అవినీతి జాడ్యం శాఖోపశాఖలుగా విస్తరించింది.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం ఎసిబికి పూర్తిస్థాయి స్వేచ్ఛనిచ్చింది. దీంతో ఎసిబి లంచగొండుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తూ పకడ్బందీగా కేసులు పెడుతోంది. 2019లో అవినీతి నిరోధక శాఖ తాను నమోదు చేసిన కేసుల జాబితాను తాజాగా విడుదల చేసింది.2019జనవరి నుండి డిసెంబర్‌ 28 వరకు 173 కేసులు నమోదు చేసి 179 మందిని రిమాండ్‌కు తరలించింది. 2018తో పోలిస్తే 2019 మరింత అవినీతికి ఉద్యోగులు పాల్పడినట్లు ఎసిబి రిపోర్టు చెబుతున్నది. 2018లో అన్ని ప్రభుత్వ శాఖల్లో కలిపి మొత్తం 139 కేసులను ఎసిబి పెట్టడం జరిగింది.2018తో పోలిస్తే 2019లో అవినీతి నిరోధక శాఖ 34 కేసులను ఎక్కువగా నమోదు చేసింది.అంటే 2018 ఏడాది కంటే దాదాపు 25 శాతం అదనంగా అవినీతి చేపలు చిక్కినట్లు స్పష్టమవ్ఞతోంది. రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లో అత్యధికంగా 54 మంది, పురపాలక శాఖలో 25మంది పోలీసు డిపార్ట్‌మెంట్‌లో 18 మంది ఎసిబికి దొరికారు. వరుసగా ఐదో ఏడాది కూడా రెవెన్యూశాఖ అవినీతిలో మొదటిర్యాంకు దక్కించుకుంది. ముఖ్యమంత్రి కార్యాలయం, ఇంటెలిజెన్స్‌ విభాగం ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తున్నా రెవెన్యూశాఖలో మార్పురావడం లేదు. 2017లో మొత్తం 65 కేసులు ఎసిబి పెట్టగా వాటిలో 17 రెవెన్యూశాఖవే. 2018లో మొత్తం కేసులు 139 కాగా వీటిలో 37 కేసులు రెవెన్యూ శాఖకు చెందినవే. 2019లోనూ మొత్తం 173 కేసులకుగాను 54 కేసులతో రెవెన్యూశాఖనే అగ్రస్థానంలో ఉంది. గత సంవత్సరం పురపాలక శాఖ ఉద్యోగులు 15 మంది ఎసిబికి దొరికితే ఈసారి ఆ సంఖ్య ఏకంగా 25కు పెరిగింది. దీంతో పురపాలక శాఖ రెండోస్థానంలో నిలిచింది. 2018లో 20 మంది పోలీసులు దొరికితే 2019లో 18 మంది అవినీతి నిరోధక శాఖ చేతికి చిక్కారు. 2018లో కేవలం నలుగురే చిక్కిన వైద్యఆరోగ్యశాఖ ఉద్యోగులు ఈసారి ఏకంగా 13 మంది ఎసిబి వలలో పడ్డారు. ఈ ఏడాది అవినీతి నిరోధక శాఖ దర్యాప్తు చేస్తున్న కేసుల్లో బీమా వైద్యసేవల (ఐఎంఎస్‌) విభాగానిదే అతిపెద్ద కేసు. ఐదేళ్లలో ఈ విభాగానికి మంజూరైన సుమారు వెయ్యి కోట్లలో 200 కోట్ల రూపాయలు పక్కదారి పట్టినట్లు దర్యాప్తు అధికారులు ఆధారాలు సేకరించారు. బాధితులకు న్యాయం జరిగేలా కోరుతూ వాదిం చాల్సిన ఇద్దరు అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లు కూడా ఈసారి ఎసిబికి దొరకడం గమనార్హం. వాస్తవానికి అవినీతి అక్రమాలు ప్రతిశాఖలో తెరమాటున నిత్యకృత్యమైపోతోన్నా అక్కడక్కడ తెరమీదకు వచ్చేవి కొన్ని మాత్రమే. కొన్ని ప్రభుత్వ కార్యాల యాల్లో లంచం ఇస్తే కానీ ఫైలు ముందుకు కదలదు. లేదంటే ప్రజలను కాళ్లు అరిగేలా తమ చుట్టూ తిప్పుకుంటారు. సహనం, ఒపిక నశించిన ప్రజలు సొమ్ములు సమర్పిస్తున్నారు. లేనట్లయితే ఎసిబిని ఆశ్రయిస్తున్నారు. అటువంటి పరిస్థితులలోనే ఎసిబి కేసులు కొన్ని నమోదవ్ఞతున్నాయి. కొంతమంది ఉద్యోగుల్లో స్వార్థం పెరిగిపోయి విలాసాలకు తాను అలవాటుపడి కుటుంబా లను ఆ రొంపిలోకి దింపి లంచాలకు తెగబడుతున్నారు. పది సంవత్సరాలు సర్వీసైనా చేయకముందే ఖరీదైన కార్లను, బంగళా లను కొనుగోలు చేస్తూ అక్రమాస్తులు దండిగాపోగేస్తున్నారు.అక్రమ వసూళ్లు, కమిషన్‌లకు తెగబడే కొన్ని శాఖల్లోని ఉద్యోగులు విధుల అనంతరం రోజువారీగా పంపకాల్లో మునిగిపోవడం సర్వ సాధారణం. అటువంటి ఉద్యోగులకు తమ జీతభత్యాలకు సంబం ధించిన అవగాహన ఏమాత్రం ఉండదు. రాష్ట్రవ్యాప్తంగా సంచల నం సృష్టించిన తహసీల్దార్‌ సజీవదహనం ఘటన మరవకముందే రెవెన్యూశాఖలో మరో మూడు ఎసిబి కేసులు నమోదవ్వటం వారి విచ్చలవిడితనాన్ని నిరూపిస్తున్నది. రంగారెడ్డి జిల్లా కేశంపేట మహిళా తహసీల్దార్‌ అవినీతి నిరోధకశాఖ అధికారులకు పట్టుబడి రెండు మాసాలు కాకుండానే ఉన్నత ఉద్యోగిగా ఉన్న ఆమె భర్త కూడా ఎసిబికి పట్టుబడటం అవినీతి అక్రమాలకు అద్దంపడుతు న్నది. అవినీతి కేసుల్లో చిక్కుకున్న ఉద్యోగులు తమకున్న డబ్బు, పలుకుబడి ద్వారా అతి తక్కువ కాలంలోనే కేసులను మాఫీ చేయించుకుంటూ తిరిగి ఉద్యోగంలో చేరి పదోన్నతులు పొందు తున్న ఉదాహరణలు కోకొల్లలు. అవినీతి నిరోధకశాఖ అధికారులు లంచాలు తీసుకుంటూ లేదా అక్రమాస్తులు కూడేసిన వారిని పట్టుకున్నప్పుడు అందులో ఎక్కువ మంది పూర్వసంవత్సరాలలో ఉత్తమ అధికారులుగా, సమర్థులుగా గుర్తింపబడినవారే ఉండటం విడ్డూరంగా ఉంటున్నది. వాస్తవానికి ప్రతి ప్రభుత్వ శాఖలో నిజాయితీగా, నిస్వార్థంగా పనిచేస్తున్న వారు ఎక్కువ మొత్తంలో ఉంటున్నప్పటికీ కొద్దిమంది లంచావతారుల వలన వారు మనస్థాపానికి గురవ్ఞతున్నారు. కొన్నిచోట్ల నేను లంచం తీసుకోను అనే బోర్డులు పెట్టుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా అవినీతికి అడ్డుకట్ట పడటం లేదు. ప్రతి ఉద్యోగి ఉద్యోగంలో చేరే సమయంలో ఉన్న ఆస్తిపాస్తులు గుర్తించి తర్వాత కొంత నిర్ణీత కాలానుగుణంగా ఎప్పటికప్పుడు శాస్త్రీయ బద్ధంగా ఆస్తులను మదింపు చేసినట్లయితే ప్రయోజనంఉంటుంది. అవినీతికి పాల్పడే అధికారులను శాశ్వతంగా ఉద్యోగం నుండి తీసివేసే చట్టం తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అవినీతి కేసుల్లో సత్వర విచారణలు జరిపి న్యాయస్థానాలు నిందితులకు కఠిన శిక్షలు విధించాలి. ప్రభుత్వం శాఖాపరమైన చర్యలకు ఉపక్రమిం చడం చాలా అవసరం. కేసుల విచారణలో నెలల తరబడి జాప్యం, శిక్షల విషయంలో సందిగ్ధత వలన అవినీతిపరులు మరింత విచ్చలవిడితనానికి పాల్పడే అవకాశముంది. పెండింగ్‌ కేసుల విచారణ కోసం ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసి నిందితులకు వేగంగా శిక్షలు విధించాలి. ప్రతి కార్యాలయంలో అవినీతి నిరోధకశాఖ ఫోన్‌నెంబర్లను ప్రదర్శించాలి. సమాచార హక్కు చట్టంపై ప్రజలకు అవగాహన కల్పిస్తే అవినీతికి అది విరు గుడుగా పనిచేస్తుంది. అన్నింటికి మించి లంచగొండుల విషయం లో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.

  • బిల్లిపెల్లి లక్ష్మారెడ్డి

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/