సరిహద్దు సమస్యలపై చర్చలే మార్గం..అమెరికా

భారత్-‌చైనా విభేదాలపై స్పందించిన అమెరికా

వాషింగ్టన్‌: భారత్-‌చైనా మధ్య కొనసాగుతున్న సరిహద్దు వివాద సమస్య పరిష్కరించుకునేందుకు, ఆ ప్రాంతంలో శాంతి నెలకొనేందుకు చర్చలు జరపడమే మార్గమని, శాంతియుత పరిష్కారానికి తాము మద్దతునిస్తామని యూఎస్ వ్యాఖ్యానించింది. తాజాగా, మీడియాతో మాట్లాడిన యూఎస్ విదేశాంగ శాఖ ప్రతినిధి నెడ్ ప్రైస్, ‘పొరుగువారిని భయపెట్టడానికి బీజింగ్ చేస్తున్న ప్రయత్నాల గురించి మేము ఆందోళన చెందుతున్నాము. మా స్నేహితులకు, భాగస్వాములకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తాము. ముఖ్యంగా ఇండో పసిఫిక్ లో భద్రత కోసం కృషి చేస్తాము’ అన్నారు.

పరిస్థితిని మేము సమీక్షిస్తున్నాం. భారత్, చైనా ప్రభుత్వాల మధ్య కొనసాగుతున్న చర్చలు ఫలించాలి. ఈ చర్చలు నేరుగా ఉన్నత స్థాయిలో జరిగితే ఓ తుది నిర్ణయం వెలువడి సమస్యలు పరిష్కారం అవుతాయని భావిస్తున్నాం’ అని నెడ్ ప్రైస్ తెలిపారు. ఇటీవల అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్, భారత విదేశాంగ మంత్రి ఎస్ జై శంకర్ మధ్య జరిగిన చర్చలను కూడా ఆయన ప్రస్తావించారు. ఇండియాతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కొనసాగిస్తామని ఆయన అన్నారు. ఇండియాతో భాగస్వామ్యంపై స్పందిస్తూ, ‘అనేక రంగాల్లో సహకారాన్ని మరింతగా పెంచుకుంటాం. మేము ప్రభుత్వాల అత్యున్నత స్థాయులలో భాగస్వామ్య సలహా, సంప్రదింపులను కొనసాగించాలని, తద్వారా, బలమైన వృద్ధి పథం కొనసాగుతుందని విశ్వసిస్తున్నాము’ అన్నారు.