రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన వైస్సార్సీపీ ..

వైస్సార్సీపీ ప్రభుత్వం రాజ్యసభ అభ్యర్థులను ఖరారు చేసింది. 15 రాష్ట్రాల్లో ఈ ఏడాది జూన్‌ 21 నుంచి ఆగస్టు ఒకటో తేదీ మధ్య పదవీకాలం పూర్తవుతున్న రాజ్యసభ సభ్యుల స్థానంలో కొత్తవారిని ఎన్నుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసింది. మొత్తం 15 రాష్ట్రాల నుంచి 57 మంది పదవీకాలం పూర్తవుతుండగా.. అందులో తెలంగాణ నుంచి రెండు, ఏపీ నుండి నాల్గు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

ఏపీ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న వి.విజయసాయిరెడ్డి, సుజనా చౌదరి, టీజీ వెంకటేష్, సురేష్‌ ప్రభుల పదవీకాలం జూన్‌ 21తో ముగుస్తుంది. ఆ స్థానాల ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూలు విడుదల చేసింది. ఈ క్రమంలో వైస్సార్సీపీ ప్రభుత్వం తమ అభ్యర్థులను ప్రకటించింది. విజయసాయిరెడ్డి, నిరంజన్‌రెడ్డి, ఆర్‌ కృష్ణయ్య, బీద మస్తాన్‌రావులను రాజ్యసభ అభ్యర్థులుగా పార్టీ ప్రకటన చేసింది. ముందుగా ఈ నలుగురు జగన్‌తో భేటీ అయ్యారు. భేటీ అనంతరం ఈ నలుగురి పేర్లను అధికారికంగా మంత్రి బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. అందరితో సంప్రదించిన తర్వాతే నలుగురి పేర్లను ఖరారు చేసినట్లు బొత్స, సజ్జల మీడియాకు తెలిపారు.