భారత్, బ్రిటన్ బంధాలపై ఇరువురు నేతల మధ్య చర్చ

బ్రిటన్ నూతన ప్రధానికి అభినందనలు తెలిపిన భారత ప్రధాని

pm-modi-congratulated-britain-new-pm-rishi-sunak-by-phone

న్యూఢిల్లీ : బ్రిటన్ నూతన ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన భారత సంతతి నేత రిషి సునాక్ కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఇందులో భాగంగా భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గురువారం రాత్రి రిషి సునాక్ కు ఫోన్ చేశారు. బ్రిటన్ నూతన ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన సునాక్ కు ఆయన అభినందనలు తెలిపారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలిపిన మోడీ… రిషి సునాక్ తో మాట్లాడటం సంతోషంగా ఉందని తెలిపారు. ఈ సందర్భంగా కలిసి పని చేద్దామని సునాక్ కు మోడీ తెలిపారు. భారత్, బ్రిటన్ ల మధ్య బంధాలను మరింత బలోపేతం చేసే దిశగా ముందుకు సాగుదామని మోడీ ఆయనకు తెలిపారు. ఇరు దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్యంపై వీలయినంత త్వరగా ఓ అవగాహనకు రావాల్సి ఉందని కూడా సునాక్ కు మోడీ తెలిపారు. ఈ ప్రతిపాదనకు సునాక్ కూడా సానుకూలంగా స్పందించినట్లు మోదీ వెల్లడించారు.

కాగా, బ్రిటన్‌ విదేశాంగ మంత్రి జేమ్స్‌ క్లెవెర్లీ శుక్రవారం భారత్‌కు చేరుకోనున్నారు. తొలుత ముంబయికి వెళ్లి 2008 ఉగ్రదాడిలో తాజ్‌ప్యాలెస్‌ హోటల్లో ప్రాణాలు కోల్పోయినవారికి ఆయన నివాళులర్పిస్తారు. శనివారం ఢిల్లీలో విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుబ్రమణ్యం జైశంకర్‌తో చర్చలు జరుపుతారు.

మరోవైపు ఈఏడాది జూలైలో రిషి సునాక్ మాట్లాడుతూ.. వీసా విధానంలో మార్పుతో భారతీయ పౌరులకు ప్రయోజనం చేకూర్చడం పై ప్రస్తావించారు. కొత్త విధానం భారతీయ పౌరులకు ప్రయోజనం చేకూరుస్తుందని అన్నారు. భారత్, యూకే ఈ సంవత్సరం జనవరిలో ఎఫ్‌టిఎ చర్చలను ప్రారంభించాయి. రెండు దేశాల మధ్య 90% వాణిజ్య సుంకాలను కవర్ చేయడానికి ఇది ఉద్దేశించబడింది. 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని దాదాపు $100 బిలియన్లకు రెట్టింపు చేయాలని ఎఫ్‌టిఎ లక్ష్యంగా పెట్టుకుంది.